YSRCP: ఏపీ రాజకీయాల్లో వైసీపీ నిలకడపై ప్రశ్నలు – జగన్ పై విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో 2024 జూన్ 12న ఏర్పాటు అయిన టీడీపీ కూటమి ప్రభుత్వం (TDP Alliance Government) మరికొద్ది రోజుల్లో ఒక సంవత్సరం పాలనను పూర్తి చేయబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై విమర్శలు, విశ్లేషణలు మొదలయ్యాయి. జూన్ 4న , ఎన్నికల ఫలితాల రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) “వెన్నుపోటు దినం” గా నిర్వహించబోతోంది. తమను ప్రజలు తప్పుగా తొలగించారని కాకుండా, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడలేదనే నెపంతో ఈ నిరసనను చేపట్టారు.
ప్రతి ప్రభుత్వంలోనూ మంచి, చెడు రెండు ఉంటాయి. కొన్ని అంశాల్లో పురోగతి సాధించగలుగుతారు, మరికొన్ని అనుకున్నట్లు కుదరదు. ఈ సమయంలో విపక్షాల పాత్ర చాలా కీలకం అవుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి, ప్రజల వాణిగా నిలవాలి. అయితే, ఈ ఏడాది కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఈ విపక్ష పాత్రను ఎంతవరకూ సమర్థవంతంగా నిర్వహించగలిగారు అనే దానిపై చర్చ జరుగుతోంది. జనాలు 2024 ఎన్నికల్లో ఓ స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమికి 164 సీట్లు, వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. దీంతో జగన్ పార్టీకు ప్రధాన ప్రత్యర్థ పార్టీ హోదా కూడా రాలేదు. గతంలో ఆయన ఓ శక్తివంతమైన సీఎం గానే కాక, సమర్థవంతమైన విపక్ష నేతగానూ వ్యవహరించారు. కానీ ఇప్పుడు హోదా లేకుండా పోరాడటం ఆయనకు కొత్త అనుభవం అయ్యింది.
ఈ ఏడాదిలో జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు. తనకు విపక్ష హోదా ఇవ్వాలంటూ కోర్టుకు కూడా వెళ్లారు. తన పార్టీ నేతల ద్వారా కొన్ని నిరసనలు నిర్వహించినా, తానే వాటిలో పాల్గొనలేదు. ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉండగా, అవి కూడా ఎక్కువగా పరామర్శలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఎక్కువగా బెంగళూరు లేదా తాడేపల్లి (Tadepalli) లోనే గడిపారని వ్యాఖ్యలు వచ్చాయి.
మరోవైపు మీడియా ద్వారా జగన్ కొన్నిసార్లు మాట్లాడినప్పటికీ, నిరంతరంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని విశ్లేషణలు ఉన్నాయి. కూటమి అమలు చేయలేకపోయిన హామీలను ఎత్తిచూపిన వైసీపీ (YCP) , తానేనైతే ప్రజల్లో పటిష్టంగా నిలవలేకపోయిందని విమర్శలు ఎదురవుతున్నాయి. పార్టీని వీడి వెళ్లిన పలువురు నేతలు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) లాంటి వారు కష్ట కాలంలో పార్టీని విడిపోవడం పార్టీ భవిష్యత్తును మరింత ప్రశ్నార్ధకంగా మారుస్తుంది. ఇలా చూస్తే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ పక్కపక్కన విపక్షాలూ బాధ్యతగా వ్యవహరించాలి. తాము విమర్శలు చేస్తే, తమ పనితీరు కూడా ఆత్మవిమర్శకు లోనవ్వాల్సిన అవసరం ఉంది. విపక్ష నేతగా జగన్ మరింత చురుకైన పాత్ర పోషించి ఉంటే, వైసీపీ గ్రాఫ్ కూడా పెరిగే అవకాశముండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.