YS Jagan: రఫ్ఫా రఫ్పా నరుకుతాం అంటే మంచిదేగా..! జగన్ నోట షాకింగ్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jagan) టీడీపీ (TDP) నేతలు చేస్తున్న విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జగన్‌ను సైకో అని పిలుస్తూ, ఆయనలో విపరీత పోకడలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. రౌడీషీటర్లను పరామర్శించడం, హత్యలకు పాల్పడిన వారిని సమర్థించడం వంటి చర్యలను ఉదాహరణలుగా చూపిస్తూ, జగన్‌పై టీడీపీ నేతలు విరుచుకుపడుతుంటారు. తాజాగా సత్తెనపల్లిలో జరిగిన ఒక సంఘటన ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసింది. దీన్ని సమర్థిస్తూ జగన్ మాట్లాడడం సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది.
సత్తెనపల్లిలో జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన పర్యటనలో ఒక వైసీపీ కార్యకర్త, 2029లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతలను “రఫ్ఫారఫ్పా నరుకుతాం” అని ప్లకార్డ్ ప్రదర్శించాడు. ఈ ప్లకార్డ్ రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, ఆ కార్యకర్త రవితేజను అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టును జగన్ తప్పుబట్టడం, ఆ కార్యకర్తను సమర్థించడం రాజకీయ వర్గాల్లో షాక్‌కు గురిచేసింది. “రఫ్ఫారఫ్పా నరుకుతాం అంటే మంచిదే కదా” అని జగన్ తాజాగా ప్రెస్ మీట్ లో సమర్థించుకున్నారు.
ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా జగన్ రాజకీయంగా తనకు తానే హాని చేసుకుంటున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు జగన్‌ను సైకో అని పిలిచేది ఇందుకే కదా.. అంటూ కొందరు సెటర్లు వేస్తున్నరు. రౌడీషీటర్లు, హత్యలు చేసిన కార్యకర్తలను ప్రోత్సహించవద్దని సూచిస్తున్నారు. మరో పోస్ట్ లో జగన్‌పై 31 కేసులు, 7 ఈడీ కేసులు, 11 సీబీఐ కేసులు ఉన్నాయని, ఆయన జీవితమంతా నేరమయమేనని పోస్ట్ చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, జగన్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని వారు ఆరోపించారు. సత్తెనపల్లి సంఘటనలో అరెస్టైన కార్యకర్తను సమర్థిస్తూ, జగన్ తన కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వాదించారు. అయితే, ఈ సమర్థన రాజకీయంగా వైఎస్‌ఆర్‌సీపీకి ఎదురుదెబ్బగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ వివాదంపై ప్రజలు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. కొందరు జగన్‌ను సమర్థిస్తూ, టీడీపీ ప్రభుత్వం కార్యకర్తలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని వాదిస్తున్నారు. మరికొందరు, హింసాత్మక వ్యాఖ్యలను సమర్థించడం రాజకీయ నాయకుడికి తగదని, జగన్ ఇలాంటి కార్యకర్తలను దూరం పెట్టాలని సూచిస్తున్నారు. “ఇలాంటి చర్యలు వైఎస్‌ఆర్‌సీపీ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయి. జగన్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి” అని ఒక నెటిజన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇలాంటి వాళ్లను సమర్థించడం వైఎస్‌ఆర్‌సీపీకి దీర్ఘకాలంలో నష్టం కలిగించవచ్చని హెచ్చరిస్తున్నారు. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ, ఇలాంటి వివాదాస్పద చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. జగన్‌కు ప్రజల్లో ఉన్న బలమైన సానుభూతి ఈ రకమైన సంఘటనల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.