Arrests: కేడర్ దెబ్బకు దిగొచ్చిన టీడీపీ..!! వరుస అరెస్టులు..!?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం (TDP Govt) వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలపై చట్టపరమైన చర్యలను ముమ్మరం చేసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఉద్విగ్నంగా మారింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై దృష్టి సారించిన టీడీపీ ప్రభుత్వం, పలువురు వైసీపీ నేతలను (YCP Leaders) అరెస్టు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. అయితే, ఈ చర్యలు టీడీపీ కేడర్‌లో అసంతృప్తిని చల్లార్చేందుకు ఒక వ్యూహంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran) అరెస్టు తర్వాత రగిలిన అసంతృప్తి నేపథ్యంలో ఈ అరెస్టులు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి విడదల రజని (Vidadala Rajani) మరిది గోపినాథ్‌ను (Gopinath) ఏసీబీ (ACB) అధికారులు అరెస్టు చేశారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఆరోపణలపై గోపినాథ్‌తో పాటు విడదల రజని కూడా నిందితులుగా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అనుచరుడు మాధవ రెడ్డిని మదనపల్లి పైల్స్ దహనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును (PSR Anjaneyulu) కాదంబరి జెత్వానీ కేసులో అరెస్టు చేశారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను (Gorantla Madhav) గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్‌పై దాడి ఆరోపణలతో అరెస్టయిన మాధవ్‌ను గుంటూరు కోర్టు రిమాండ్ కు ఇచ్చింది. పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) పై అభియోగాలు నమోదు చేస్తూ వివరణ కోరింది. ఇవన్నీ ఈ వారం రోజుల వ్యవధిలోనే జరిగాయి.
టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) భార్య వైఎస్ భారతిపై (YS Bharathi Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో కిరణ్‌ను టీడీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. అనంతరం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశాల మేరకు అతన్ని అరెస్టు చేశారు. ఈ అరెస్టు టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. కిరణ్‌ను సస్పెండ్ చేయడం, అరెస్టు చేయడం ద్వారా టీడీపీ తమ కార్యకర్తలను కాపాడుకోలేకపోతోందన్న భావన కొందరిలో కలిగింది. దీంతో కేడర్ ను సంప్తి పరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై చర్యలను వేగవంతం చేసింది. కేవలం అక్రమ కేసులపై దృష్టి సారించడమే కాకుండా, కేడర్‌కు తాము బలంగా వ్యవహరిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి ఒక వ్యూహంగా కనిపిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం టీడీపీ నేతల అరెస్టుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించింది. ఆధారాలు లేకపోయినా అరెస్టు చేసి కోర్టుల్లో అభాసుపాలైంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి వాటిలో అస్సలు తొందరపడట్లేదు. తగిన ఆదారాలు లభించిన తర్వాతే కేసు పెట్టి అరెస్టు చేస్తోంది. వాళ్లను జైలుకు పంపించే వ్యూహం పన్నింది. అందుకే అరెస్టులు ఆలస్యమవుతున్నాయని, తప్పున చేసిన వాళ్లకు శిక్ష తప్పదని కేడర్ కు నచ్చచెప్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వంలో కొందరు పెద్దలు కుమ్మక్కయ్యారేమోనని అనుమానాలు మొదలయ్యాయి. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం కేసుల్లో స్పీడ్ పెంచింది.