AP: ఏపీలో శ్రుతి మించుతున్న మాటల యుద్ధం..!!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో చేపట్టిన పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను వివాదానికి దారితీసింది. ఈ పర్యటన సందర్భంగా వైసీపీ (YCP) కార్యకర్తలు “రప్పా రప్పా నరుకుతాం” అనే ఫ్లెక్సీలు ప్రదర్శించడం, ఆ వ్యాఖ్యలను జగన్ సమర్థించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై అధికార టీడీపీ (TDP), జనసేన (Janasena) నాయకులు గట్టిగా స్పందించడంతో రాజకీయ సుహృద్భావం కొరవడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ బుధవారం రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు “2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం” అని పేర్కొన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ బ్యానర్లు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని, హింసాత్మక ధోరణిని ప్రోత్సహిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. జగన్ ఈ ఫ్లెక్సీలను సమర్థిస్తూ ” ఒకప్పటి టీడీపీ కార్యకర్తే ఇప్పుడు వైసీపీ అభిమానిగా మారి ఈ ఫ్లెక్సీలు పెట్టాడు, ఇందులో తప్పేముంది? ఇది సంతోషకరమైన విషయమే కదా” అని వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత రాజుకునేలా చేసింది.
జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “జగన్ ఫ్యాక్షనిస్టులా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. రాష్ట్రాన్ని యోగాంధ్రగా తీర్చిదిద్దుతుంటే, జగన్ హింసను ప్రోత్సహిస్తూ ప్రజలను భయపెడుతున్నారు” అని ఆరోపించారు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని, ఆయన వ్యాఖ్యలు క్రిమినల్ ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Cy CM Pawan Kalyan) కూడా జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. “సినిమా డైలాగులు థియేటర్లలో బాగుంటాయి, రాజకీయాల్లో కాదు. రప్పా రప్పా నరుకుతామని చెప్పడం హింసను ప్రోత్సహించడమే. పరిధి మీరి మాట్లాడితే చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని సహించబోదని స్పష్టం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “మేం జగన్ తల నరకలేమా?” అని ఘాటుగా ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఈ పర్యటనను “ఓదార్పు యాత్ర కాదు, రాజకీయ యుద్ధం” అని విమర్శించారు. మంత్రి పయ్యావుల కేశవ్, “రప్పా రప్పా నరుకుతామంటే ఎవర్ని నరుకుతారు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా?” అని నిలదీశారు. జగన్ పర్యటనలో పోలీసు ఆంక్షలను ఉల్లంఘించడం, బారికేడ్లను తొలగించడం వంటి చర్యలపై కూడా టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తానికి జగన్ రెంటపాళ్ల పర్యటన, “రప్పా రప్పా” ఫ్లెక్సీల వివాదం ఏపీ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘటన రాజకీయ నాయకుల మధ్య బాధ్యతాయుతమైన ప్రవర్తనను, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.