Tuni Rail Incident : తుని రైలు దహనం కేసు… చంద్రబాబు సర్కార్ యూటర్న్..!!

తుని రైలు దహనం కేసు (Tuni Rail Attack Case) ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. 2016 జనవరి 31న తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలపై కేసు నమోదైంది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు (Kapu Reservations) కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) నాయకత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ (Rathnachal Express) రైలుకు కొందరు నిప్పు పెట్టారు. దీంతో రైలు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పాల్గొన్న వారిపై రైల్వే చట్టంలోని సెక్షన్‌లు 146, 147, 153, 174 (ఎ), (సి) కింద కేసులు నమోదయ్యాయి.
2016లో జరిగిన ఈ ఘటన తర్వాత, గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఈ కేసులో పలువురిని అరెస్టు చేశాయి. అయితే.. 2021లో వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జి, కోర్టు ఫర్ రైల్వేస్ ఈ కేసులను కొట్టివేసింది. విచారణ సరిగా జరగలేదని, ఆధారాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుపై రైల్వే శాఖ ముద్రగడ సహా కొందరికి సమన్లు జారీ చేసినప్పటికీ, కేసు ముందుకు సాగలేదు.
2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (NDA Govt) ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాపు ఉద్యమ నేతలపై కేసులను కొట్టివేయడం రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయంగా భావించింది కూటమి ప్రభుత్వం. ఈ కేసులను పునర్విచారణ చేయాలని నిర్ణయించింది. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభంను ఇరుకున పెట్టేందుకు మళ్లీ ఈ కేసును తెరపైకి తెస్తోందనే విమర్శలు వచ్చాయి.
అయితే, ఈ అప్పీల్ నిర్ణయంపై చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం తాజాగా వెనక్కు తగ్గింది. ఈ కేసును తిరగదోడే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెనుక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు గుర్తించింది. ఈ ఉత్తర్వులు ఏ స్థాయిలో ఆమోదం పొందాయి, ఎలా ఫైల్ నడిచిందనే దానిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. సున్నితమైన అంశాలపై అలసత్వంతో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, అప్పీల్‌కు సంబంధించిన జీవోను రద్దు చేస్తూ కొత్త ఉత్తర్వులు వెలువడనున్నాయి.
తుని కేసు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదు. ఇందులో రాజకీయ, సామాజిక డైనమిక్స్ కూడా ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. 2016లో జరిగిన ఈ ఉద్యమం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంలో ఓ భాగం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ కేసులను కొట్టివేయడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసిందనే వాదన ఉంది. అదే సమయంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరగదోడాలని ప్రయత్నించడం వెనుక, గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశం ఉందని భావించారు. అయితే, ఈ నిర్ణయం సున్నితమైన సామాజిక అంశాలను తాకడంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గింది.