P4 Scheme: పేదరికంపై ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తోందా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047లో (Swarnandhra 2047) భాగంగా ‘జీరో పావర్టీ – P4 పథకం’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ‘పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్’ (P4) అని దీనికి పేరు పెట్టింది. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, సమాజంలోని ధనవంతుల సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను దత్తత తీసుకోవడం, వారిని సామాజిక, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది దీని ఉద్దేశం. అయితే, ఈ పథకం అమలు తీరు, దాని ఉద్దేశాలు, అమలులోని సవాళ్లపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
P4 పథకం కింద, రాష్ట్రంలోని 20 లక్షల అత్యంత ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను (బంగారు కుటుంబాలు) గుర్తించి, వీటిని సమాజంలోని టాప్ 10% ధనవంతులు (మార్గదర్శులు) దత్తత తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ మార్గదర్శులు ఆర్థిక సహాయం, విద్య, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, కెరీర్ మార్గదర్శనం వంటి వివిధ రూపాల్లో సహాయం అందించాలి. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, గ్రామ స్థాయిలో ‘P4 సొసైటీ’ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకంలో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంటూ, కేవలం విధాన రూపకల్పన, పర్యవేక్షణలో మాత్రమే పాల్గొంటుంది. ఈ పథకం ద్వారా గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్, వ్యవసాయ రంగంలో ప్రాథమిక సౌకర్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, P4 పథకం అమలులో పలు సవాళ్లు, విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, ఈ పథకం కోసం అధికారులు, ఉద్యోగులపై టార్గెట్లు విధించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మధ్యతరగతి ఉపాధ్యాయులు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారని, అలాంటి వాళ్లను ఈ పథకం కింద కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) తెలిపింది. సామాన్య ఉద్యోగులు ఇలాంటి ఒత్తిళ్ల ద్వారా ఇబ్బందులు పడతారని, అలా చేయడం ఈ పథకం ఉద్దేశాన్ని విస్మరిస్తుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
మరో ముఖ్యమైన విమర్శ ఏంటంటే, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా, పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అర్థమవుతోంది. ఇప్పుడు ధనవంతులను ఆశ్రయించడం ద్వారా తమ బాధ్యతను వారిపైకి నెట్టివేస్తున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఆర్థిక సహాయం అందించడంపై దృష్టి సారిస్తున్నాయి కానీ, పేదలకు ఉద్యోగ అవకాశాలు లేదా స్థిరమైన ఉపాధి కల్పించే దీర్ఘకాలిక విధానాలపై దృష్టి పెట్టడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా నగదు అందిసిత్న్నాయి. కానీ, ఉపాధి సృష్టి లేదా నైపుణ్య శిక్షణపై తగినంత దృష్టి పెట్టట్లేదు.
P4 పథకంపై మరో ముఖ్యమైన విమర్శ ఏంటంటే, ఇది ప్రభుత్వ బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులపైకి మళ్లించే ప్రయత్నంగా ఉంది. స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాలుగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ, పేదరికం ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. అదనంగా, P4 పథకంలో మార్గదర్శుల ఎంపిక, వారి రాజకీయ సంబంధాలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మార్గదర్శులు రాజకీయ ప్రభావంతో కూడిన వ్యక్తులుగా ఉండవచ్చని, ఇది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి సందేహాలు పథకం పారదర్శకత, నిష్పక్షపాతతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
P4 పథకం ఒక వినూత్న ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ, దాని అమలులోని సవాళ్లు, విమర్శలు ప్రభుత్వ విధానాలలోని లోపాలను స్పష్టం చేస్తున్నాయి. పేదరిక నిర్మూలనకు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, స్థిరమైన ఆర్థిక విధానాలపై దృష్టి సారించడం అవసరం. P4 పథకం సమాజంలోని సహకారాన్ని ప్రోత్సహించే ఒక మంచి ప్రయత్నం కావచ్చు, కానీ ఇది ప్రభుత్వ బాధ్యతను పూర్తిగా భర్తీ చేయలేదు. ఈ పథకం విజయవంతం కావాలంటే, పారదర్శకత, సరైన అమలు, ఉద్యోగులపై అనవసర ఒత్తిడిని తగ్గించడం ద్వారా, అసలైన లబ్ధిదారులకు నిజమైన సహాయం అందేలా చూడాలి.