Mudragada Padmanabham: తిరిగి వార్తల్లోకి ముద్రగడ: ఒక నిర్ణయంతో ఊపందుకున్న పేరు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) పాత్ర మళ్లీ చర్చకు వచ్చిందని చెప్పాలి. ఒకప్పుడు ఉద్యమ నేతగా, మంత్రిగా పేరు పొందిన ఆయన ఇటీవల రాజకీయంగా దూరంగా ఉన్నా, ఆయన ప్రభావం ఇంకా తగ్గలేదని తాజా పరిణామాలు చాటుతున్నాయి. ఇటీవల పిఠాపురం (Pithapuram) నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ మెజారిటీతో గెలవడంతో ముద్రగడ్డ చాలా వరకు మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఆయన ఏవైనా వ్యాఖ్యలు చేయకపోయినా, మౌనంగా ఉన్నా, ఆయన నీడ రాజకీయాలను ప్రభావితం చేస్తోందని ఈ పరిణామాల ద్వారా తెలుస్తోంది.
1990లలో ముద్రగడ ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగా కనిపించారు. కాపు (Kapu) సామాజిక వర్గానికి బీసీ (BC) హోదా కల్పించాలని ఉద్యమాన్ని నడిపారు. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి (Kotla Vijayabhaskar Reddy) ఆయన దీక్ష ఫలితంగా జివో 30 ద్వారా కాపులను బీసీల్లో చేర్చనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇది ఆయన ఆందోళనలకు విజయాన్ని చాటింది. ఆ కాలంలో ఆయన పేరు దూసుకుపోయింది.
ఆ తరువాత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని టీడీపీలో (TDP) కూడా పనిచేసిన ముద్రగడ, 2014 తర్వాత బాబుతో విభేదాలు పెంచుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శిస్తూ పెద్ద ఉద్యమం మొదలుపెట్టారు. దీనివల్ల తుని (Tuni) ఘటన చోటుచేసుకుంది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (Ratnachal Express) రైలు దగ్ధమవడం వంటి ఘర్షణలు జరిగాయి. ఈ కేసుల్లో ముద్రగడపై కేసులు నమోదయ్యాయి.
2019లో వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసులు ఎత్తివేయబడినప్పటికీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి ఆ కేసులపై అప్పీల్ కు సిద్ధమవ్వడం, అతి తక్కువ సమయంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇది ముద్రగడకి అనుకూలంగా మారిందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పరిణామాలతో ముద్రగడ గ్రాఫ్ మళ్లీ పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని వయస్సు 70 దాటినప్పటికీ, కాపు సామాజిక వర్గానికి ఇంకా ఆయనపై నమ్మకం ఉన్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన మళ్లీ ప్రజల్లోకి వస్తే రాజకీయంగా ప్రభావం చూపుతారని భావిస్తున్నారు. ఈ కేసుల ఎత్తుపుల్లులు, వెనక్కు తగ్గడాలు ఆయనకు అనుకోకుండా ప్రచారం తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది.