Pawan Kalyan: ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్ వెనుకబడుతున్నారా..?
జనసేన(Janasena) అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన అభిమానులు అనుసరిస్తున్న వైఖరి జనసేన పార్టీకి తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇక 2024 ఎన్నికలు వచ్చే సమయానికి వైసీపీకి వ్యతిరేకంగా నిలిచి పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి పంపించారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను నాయకుడిగా ప్రమోట్ చేసే విషయంలో జనసేన పార్టీ పూర్తిగా వెనకబడుతోంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.
రాజకీయంగా ఇది జనసేన పార్టీకి ఇబ్బందికర పరిణామమే. పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా ఆ పార్టీ కార్యకర్తలు సినిమా హీరో గానే ఇంకా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారని జనసేన పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఆ స్థానాలు పెరగాలి, లేదంటే జనసేన పార్టీపై ప్రజల్లో కాస్త చులకన భావం ఏర్పడే సంకేతాలు కూడా ఉంటాయి.
కాబట్టి పవన్ కళ్యాణ్ ను దాదాపు ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జనసేన పార్టీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం ముందడుగు వేయటం లేదు ఆ పార్టీ కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలను, చేయబోయే సినిమాలను ప్రమోట్ చేయడం, లేదంటే ఆయన ఎక్కడికైనా వెళ్లి ప్రసంగాలు చేస్తున్న సమయంలో ఆ సినిమా నినాదాలు చేయడం మాత్రమే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న లేదంటే జనసేన పార్టీ మంత్రుల శాఖలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా సరే వాటిని ప్రచారం చేసుకునే విషయంలో జనసేన పార్టీ వెనకడుగు వేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రచారం గట్టిగా జరుగుతున్నా, జనసేన పార్టీ తరఫున మాత్రం ఆ పార్టీ మంత్రులకు సరైన ప్రచారం కల్పించడం లేదు. చివరకు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే వైఖరి ఉండటం మరింత ఇబ్బంది పెడుతోంది. ఈ వైఖరి మారకపోతే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇబ్బంది పడే సంకేతాలు ఉంటాయి. ఇక నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై కూడా జనసేన పార్టీ దృష్టి సారించడం లేదని విమర్శలు సైతం ఉన్నాయి. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను జనసేన పార్టీలోకి తీసుకున్నారు. మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు సైతం జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఆ చేరికలు ఆగిపోయాయి. మరి భవిష్యత్తులో అయినా పవన్ కళ్యాణ్ విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలు పరిస్థితికి తగ్గట్టు ప్రవర్తిస్తారో లేదో చూడాలి.







