YS Sharmila: చిచ్చు రేపిన షర్మిల.. హైకమాండ్ ఆగ్రహం..!?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (YS Sharmila), దళితవాడల్లో 5 వేల ఆలయాలు నిర్మించాలనే టీటీడీ (TTD) నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ప్రచారకుడిగా మారిపోయారని ఆమె విమర్శించారు. టీటీడీ నిధులను మౌలిక సదుపాయాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అయితే షర్మిలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాక షర్మిల తీరుపై సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ హైకమాండ్ కూడా షర్మిలపై ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఆమె వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దళితులు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు షర్మిల కామెంట్స్ వాళ్లలో ఆగ్రహానికి కారణమయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని దళిత వాడల్లో 5 వేల వేంకటేశ్వర స్వామి ఆలయాలు (TTD Temples) నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీకి భక్తులు ఇచ్చే విరాళాల నుంచి ఈ ఆలయాలను నిర్మించాలని ప్రతిపాదించింది. ప్రతి ఆలయానికి సుమారు 5-10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా దళిత కాలనీల్లో ఈ ఆలయాల నిర్మాణం ప్రారంభమైతే, హిందూ భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. టీటీడీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దళిత సమాజంలో హిందూ భావాలను బలోపేతం చేయడానికి ఇది మంచి చర్య అని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ అన్నారు.
ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల టీటీడీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. టీటీడీ నిధులు భక్తుల దానాలతో సమకూరాయని, వాటిని ఆలయాలకు ఉపయోగించకుండా, దళిత కాలనీల్లో రోడ్లు, నీటి సరఫరా, విద్య, ఆసుపత్రులకు ఖర్చు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దళితులు ఆలయాలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీని అమలు చేయడమేనని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుడిగా అభివర్ణించారు. షర్మిల కామెంట్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షర్మిలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించడాన్ని విమర్శించే హక్కు షర్మిలకు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ విమర్శించారు. వై.ఎస్.ఆర్ కుటుంబం హిందూ ఆలయాలపై అక్కసు వెళ్లగక్కుతోందని మండిపడ్డారు. షర్మిల కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ మనోభావాలను గాయపరిచేలా షర్మిల మాట్లాడారని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తే షర్మిలకు తలెత్తే సమస్య ఏంటని ప్రశ్నించారు.
మరోవైపు సొంత పార్టీలో కూడా షర్మిల కామెంట్స్ పై ఆగ్రహం వ్క్తమవుతోంది. పార్టీ హైకాండ్ కూడా ఆమెను వారించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దళితులు అండగా ఉంటున్నారు. ఆ ఓటు బ్యాంకును మళ్లీ సాధించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో షర్మిల వ్యాఖ్యలు దళితులను దూరం చేసేలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. షర్మిల తీరుపై ఏపీలో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు దళితులపై కామెంట్స్ తో ఆమె మరింత దూరమయ్యారు.