Kakinada SEZ: కాకినాడ సెజ్ రైతులకు గుడ్ న్యూస్

కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) కోసం రెండు దశాబ్దాల క్రితం భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు ముగింపు పలుకుతూ, రైతుల నుంచి సేకరించిన 2,180 ఎకరాల భూమిని వారికి తిరిగి అప్పగించాలని నిర్ణయించింది. అంతేకాక, ఈ భూములను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు ఎలాంటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయకూడదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ అంశంపై తీసుకున్న ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం సాకారమైంది. ఈ నిర్ణయంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఉన్న 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
2000వ దశకం మధ్యలో కాకినాడ ప్రాంతంలో సుమారు 10వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించి కాకినాడ సెజ్ (Kakinada Special Economic Zone) ను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కోసం ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలోని రైతుల నుంచి భూములను సేకరించారు. అయితే, ప్రణాళిక ప్రకారం పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడం, ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంతో, భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిహారం పొందినప్పటికీ, తమ భూములు సెజ్ యాజమాన్యం పేరు మీద ఉండటంతో, సాగు చేసుకుంటున్నా యాజమాన్య హక్కులు లేకపోయాయి. దీంతో ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు వంటి ప్రయోజనాలను పొందలేకపోయారు. దీంతో తమ భూములను తిరిగి ఇవ్వాలని రైతులు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.
రైతుల దీర్ఘకాల డిమాండ్‌ను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ సెజ్‌కు రైతుల నుంచి సేకరించిన మొత్తం భూమిలోంచి 2,180 ఎకరాల భూములను తిరిగి రైతులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తిరిగి రైతుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ పూర్తిగా మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి, 2021లో గత వైసీపీ ప్రభుత్వం కూడా 2,180 ఎకరాలను తిరిగి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపి జీవో జారీ చేసింది. అయినా అది అమలు కాలేదు. రైతులకు రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో భూములు సెజ్ యాజమాన్యం పేరు మీదే ఉండిపోయాయి.
తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి, ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. తక్షణమే ఉత్తర్వులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. దీనిపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో, రైతులకు తమ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు తిరిగి దక్కనున్నాయి.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో కాకినాడ సెజ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరపడి, తమ భూములు తిరిగి తమ సొంతమవుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులు తమ భూములపై చట్టబద్ధమైన హక్కులను పొంది, వ్యవసాయం, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి వీలు కలుగుతుంది. రెవెన్యూ శాఖ అధికారులు త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.