Trump-Mamdani: మమ్దానీ ఓ కమ్యూనిస్ట్.. ట్రంప్ ఓ అవినీతి బిలియనీర్..!
న్యూయార్క్ నూతన మేయర్ మమ్దానీ (Mamdani) పై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ అయిన మమ్దానీ ఒక ‘కమ్యూనిస్ట్’ అని ఆరోపించిన ట్రంప్, ఆయన గెలుపుతో న్యూయార్క్ నగరం కమ్యూనిస్ట్ క్యూబా లేదా సోషలిస్ట్ వెనిజులాగా మారిపోతుందని హెచ్చరించారు. ఈ మార్పుల కారణంగా న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు.
మియామిలో జరిగిన ‘అమెరికా బిజినెస్ ఫోరమ్’లో ట్రంప్ మాట్లాడుతూ.. “నవంబర్ 5న అమెరికా ప్రజలు మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. మన సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించుకున్నాం. కానీ .. లేటెస్టుగా న్యూయార్క్‌లో మనం మన సార్వభౌమాధికారాన్ని కొద్దిగా కోల్పోయాం. అయినా ఫర్వాలేదు, దాని సంగతి మేం చూసుకుంటాం” అని వ్యాఖ్యానించారు. ధనవంతులపై పన్నులు పెంచి ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చి 34 ఏళ్ల మమ్దానీ గెలిచారని, ఆయన విధానాలు డెమొక్రాటిక్ పార్టీ జాతీయ ప్రణాళికకు ప్రతిబింబమని ట్రంప్ ఆరోపించారు.
“మన ప్రత్యర్థులు అమెరికాను కమ్యూనిస్ట్ క్యూబాగా, సోషలిస్ట్ వెనిజులాగా మార్చాలని చూస్తున్నారని నేను ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు డెమొక్రాట్లు ఎంత తీవ్రంగా ఉన్నారంటే, న్యూయార్క్ నగరంలోని కమ్యూనిజం నుంచి పారిపోయి వచ్చేవారికి మియామి త్వరలోనే ఆశ్రయం కల్పిస్తుంది” అని ట్రంప్ అన్నారు.
ట్రంప్‌కు గట్టిగా బదులిచ్చిన మమ్దానీ
మరోవైపు తన విజయ ప్రసంగంలో మేయర్ జోహ్రాన్ మమ్దానీ నేరుగా ట్రంప్‌ను సవాల్ చేశారు. “డొనాల్డ్ ట్రంప్, నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. నీకోసం నాలుగు మాటలు చెబుతున్నా.. గొంతు పెంచుకో” అంటూ గట్టిగా బదులిచ్చారు. వలసదారుల నాయకత్వంలో న్యూయార్క్‌ను ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు. “ట్రంప్ వంటి భూస్వాములు, బిలియనీర్లు పన్నులు ఎగ్గొట్టి లబ్ధి పొందే అవినీతి సంస్కృతికి చరమగీతం పాడుతాం. ఒక నిరంకుశుడిని భయపెట్టాలంటే, అతడు అధికారం సంపాదించడానికి దోహదపడిన పరిస్థితులనే కూల్చివేయాలి” అని మమ్దానీ స్పష్టం చేశారు.
మమ్దానీ విజయ ప్రసంగం చాలా ‘కోపంగా’ ఉందని, ఇది మంచి ప్రారంభం కాదంటూ ట్రంప్ రియాక్టయ్యారు. వాషింగ్టన్ పట్ల గౌరవంగా లేకపోతే ఆయన విజయవంతం కాలేరని సూచించారు. ఇదే క్రమంలో న్యూయార్క్ మాజీ మేయర్ బిల్ డి బ్లాసియో చరిత్రలోనే అత్యంత చెత్త మేయర్ అని కూడా ట్రంప్ విమర్శించారు.







