పంచశీల భేష్ అంటున్న చైనా..
నాడు పంచశీల ఒప్పందానికి తూట్లు పొడిచి, తుంగలో తొక్కిన చైనా.. ఇప్పుడు అదే సిద్ధాంతం భేష్ అంటోంది. ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు ఈ ఐదు సూత్రాలు మెరుగ్గా పనిచేస్తాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు.చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్. ఇంతకూ జిన్ పింగ్ ఎందుకలా అన్నారు. ఇది నిజంగానే అన్నమాటా, లేక చైనా వ్యూహాంలో భాగంగా జిన్ పింగ్ ఇలాంటి కామెంట్స్ చేశారా..? ఏదేమైనా జిన్ పింగ్ కామెంట్స్ తో మరోసారి పంచశీల తెరపైకి వచ్చింది.
వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్‌తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్ – చైనా మధ్య కుదిరిన ‘పంచశీల ఒప్పందాని’కి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఒప్పందం అనివార్యమైన చారిత్రక పరిణామం. శాంతి, అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానమిచ్చాయి. చైనా-భారత్, చైనా-మయన్మార్‌తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను మా గత నాయకత్వం చేర్చింది. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది’’ అని జిన్‌పింగ్ గుర్తుచేశారు.
‘‘మొదట ఈ పంచశీల ఒప్పందం ఆసియాలో పుట్టింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1960ల్లో మొదలైన అలీనోద్యమానికీ ఈ ఐదు సూత్రాలు మార్గదర్శకంగా నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాలకు ఈ సూత్రాలు ఓ ప్రమాణాన్ని నిర్దేశించాయి. వర్తమాన సంఘర్షణలను అంతం చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. ప్రపంచ భద్రత కోసం మేం తీసుకొస్తున్న గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్‌లోనూ ఈ విధానాలను అనుసరించాలనుకుంటున్నాం’’ అని చైనా అధినేత వెల్లడించారు.
ఏంటీ పంచశీల ఒప్పందం..
పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో భారత్ – చైనా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 1954లో ఇరు దేశాల అప్పటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ , చౌ-ఎన్లై దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి.






