Denmark: అమెరికాపై చిట్టెలుక డెన్మార్క్ విజయం సాధించేనా..?
అగ్రరాజ్యం అమెరికా బెదిరింపులు, గ్రీన్ లాండ్ ఇవ్వాల్సిందే అంటున్న హెచ్చరికలను.. డెన్మార్క్ అస్సలు పట్టించుకోవడం లేదు. సరికదా.. తాము అగ్రరాజ్యంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆ యూరోపియన్ దేశం తెగేసి చెబుతోంది. ఇంతకూ అసలు డెన్మార్క్.. అగ్రరాజ్యాన్ని ఎదుర్కోగలదా..? అసలు ఆదేశానికి ఉన్న రక్షణ సామర్థ్యమెంత…?
అమెరికా సైనిక చర్యకు దిగితే 1952 కోల్డ్‌వార్ నాటి ఒప్పందం ప్రకారం వెంటనే ప్రతి చర్యకు దిగే హక్కు తమకుందని డెన్మార్క్ అంటోంది. ఏదైనా ఆక్రమణ ప్రయత్నం జరిగితే కమాండర్ల ఆదేశాల కోసం ఎదురుచూడకుండానే ప్రతిఘటించే అవకాశం డానిష్ సైన్యానికి ఉంది. 1940 ఏప్రిల్‌లో డెన్మార్క్‌ను నాజీ జర్మనీ ఆక్రమించిన తర్వాత ఈ నిబంధనను తీసుకొచ్చారు.
సంయుక్త ఆర్కిటిక్ కమాండే కీలకం
ఏ దేశమైనా దండెత్తితే ప్రతిఘటించే బాధ్యతలను డెన్మార్క్‌కు చెందిన సంయుక్త ఆర్కిటిక్ కమాండ్ చేపడుతుంది. దీని ప్రధాన కార్యాలయం నూక్‌లో ఉంటుంది. ఈ కమాండ్‌లో డెన్మార్క్ త్రివిధ దళాలకు చెందిన సైనికులతోపాటు ప్రత్యేక బలగాలుంటాయి. ఈ కమాండ్‌కు డెన్మార్క్‌తోపాటు 200 నాటికల్ మైళ్ల వరకూ విస్తరించి ఉన్న ఫారోస్ ఫిషరీ జోన్, గ్రీన్లాండిక్ ఆర్థిక మండలి, గ్రీన్లాండ్ సెర్చ్ అండ్ రెస్క్యూ రీజియన్ (ఎస్ఆర్ఆర్) రక్షణ బాధ్యతలుంటాయి. గ్రీన్లాండ్, ఫారో ఐలాండ్ల సార్వభౌమత్వాన్ని కాపాడటం, నిఘా, సముద్ర కాలుష్య నియంత్రణ, ఫిషరీస్ ఇన్స్పెక్షన్, హైడ్రోగ్రాఫిక్ సర్వే, ప్రభుత్వ సైన్స్ మిషన్లకు సహకార బాధ్యతలను ఈ కమాండ్ చూస్తుంది. దీనికి ప్రత్యేక ఆపరేషన్స్ కమాండ్ (ఎస్వోకేవోఎం) సహకరిస్తుంది.
డెన్మార్క్ సైన్యంలో నాలుగు విభాగాలుంటాయి. వాటిలో రాయల్ డానిష్ ఆర్మీ, రాయల్ డానిష్ ఎయిర్‌ఫోర్స్, రాయల్ డానిష్ నేవీ, ఆర్కిటిక్ కమాండ్ ఉంటాయి. ప్రపంచంలో సైనిక బలాల పరంగా చూస్తే డెన్మార్క్ 45వ స్థానంలో ఉంది. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు డానిష్ ఆర్మీకి కాస్త అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే అక్కడి అత్యం త శీతల పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీ పనిచేయదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.






