Trump: ట్రంప్ న్యూస్టార్ట్ ప్లాన్.. చైనా ఉచ్చుకు చిక్కేనా..?
కోల్డ్ వార్ కాలం నుంచి అత్యధిక అణ్వాయుధాలు కలిగి దేశాలు అమెరికా. రష్యా మాత్రమే. వాటి దగ్గర ఉన్న అణ్వాయుధాలను వాడితే ఈ భూమిని అనేకసార్లు ధ్వంసం చేయవచ్చు. అందుకే ఆ రెండు దేశాలు కలిసి అనేక ద్వైపాక్షిక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వాటిలో కీలకమైంది న్యూ స్టార్ట్. ఈ వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం గడువు ముగుస్తోంది. దీంతో.. ఈ రెండు దేశాలు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయా, రద్దు చేసుకుంటాయా..అన్న చర్చ మధ్య మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. అదే న్యూ స్టార్ట్‌లోకి చైనా కూడా చేరాలని ట్రంప్ చేస్తున్న ప్రతిపాదన.
2021లో ఈ ఒప్పందం గడువు తీరే సమయంలో.. న్యూ స్టార్ట్ కొనసాగుతుందా, రద్దవుతుందా అనే విషయంలో పెద్ద చర్చ జరిగింది. పొడిగింపునకు రెండు దేశాలు అంగీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతమూ దాదాపు అదే పరిస్థితి. ఎందుకంటే ఒప్పంద పునరుద్ధరణపై ఇప్పటివరకు అటు అమెరికా నుంచి.. ఇటు రష్యా నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. అయితే న్యూ స్టార్ట్పై గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్య చేశారు. మరో సంవత్సరం ఒప్పందం పొడిగించుకొవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
ట్రంప్ వ్యూహం
వెనెజువెలా, గ్రీన్లాండ్ అంశాల్లో వివాదాస్పదంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు న్యూ స్టార్ట్ విషయంలోనూ తలదూర్చారు. ఈ ఒప్పందంపై ఇటీవల ఆయన ‘న్యూయార్క్ టైమ్స్’తో మాట్లాడుతూ, ‘న్యూ స్టార్ట్’ స్థానంలో రష్యాతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘గడువు ముగిస్తే ముగిసిపోనీ.. మేమింకా మెరుగైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం’ అని పేర్కొన్నారు. దీంతో ప్రతిష్టంభన తొలగిపోయిందని అనుకున్నారంతా. అంతలోనే ట్రంప్ మళ్లీ ఓ బాంబు పేల్చారు. ఏ అణుచర్చలు జరిగినా అందులో చైనా భాగస్వామిగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యే ఇప్పుడు గుబులు రేపుతోంది. ఇందులోకి బీజింగ్‌ను లాగడం ద్వారా మొత్తం ఒప్పందాన్ని ట్రంప్ ఇరకాటంలో నెడుతున్నారని అంటున్నారు నిపుణులు.
చైనా అంగీకరిస్తుందా..
అమెరికా, రష్యా అంత స్థాయిలో చైనా దగ్గర అణ్వాయుధాలు లేకపోయినా.. ఆ దేశమూ ఇటీవల దూకుడు పెంచింది. ఈ పరిణామం ట్రంప్ యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. అందుకే ద్వైపాక్షిక ఒప్పందంగా ఉన్న ‘న్యూ స్టార్ట్’ను త్రైపాక్షికంగా మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు. న్యూ స్టార్ట్‌లోకి చైనాను చేర్చడం ద్వారా ఆ దేశ అణ్వాయుధాలపై నియంత్రణ విధించాలన్నది ఆయన ప్రణాళిక. ఈ పరిణామాలను బీజింగ్ కూడా గమనిస్తోంది. రష్యా, అమెరికా ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో తమ దేశం భాగస్వామి కాబోదని గతంలో చాలా సార్లు చైనా పేర్కొంది. ఇప్పుడూ అదే వైఖరితో ఉంది.
న్యూ స్టార్ట్ ఒప్పందం..?
న్యూ స్టార్ట్ అంటే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం. అమెరికా, రష్యాల మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న ఏకైక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందమిదే. 2010లో దీనిపై నాటి అమెరికా, రష్యా అధ్యక్షులు బరాక్ ఒబామా, దిమిత్రి మెద్వదెవ్ సంతకాలు చేశారు. ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 2011లో. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు 1550కి మించి వార్ హెడ్లను మోహరించకూడదు. 700 క్షిపణులు, బాంబర్లకే పరిమితం కావాలి. 2021లో ఈ ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు ఆ గడువు ముగియనుంది.






