Modi: లోక్‌సభలో ప్రధాని మోదీపై దాడికి కుట్ర..?
భారత పార్లమెంటరీ చరిత్రలో ఫిబ్రవరి 5 ఒక చీకటి రోజుగా మిగిలిపోయే ప్రమాదం తృటిలో తప్పిందా? అంటే అవుననే అంటున్నాయి పార్లమెంటరీ వర్గాలు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగం లేకుండానే సభ ముగియడం వెనుక కేవలం రాజకీయ గందరగోళం మాత్రమే లేదు, ఒక పెను ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఈసారి నిరసనను కేవలం నినాదాలకే పరిమితం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించగానే, పెద్ద సంఖ్యలో ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆయనను చుట్టుముట్టేలా ప్లాన్ చేశారని సమాచారం. సాధారణంగా పురుష ఎంపీలు అలజడి సృష్టిస్తే మార్షల్స్ వారిని అడ్డుకుంటారు. కానీ, ముందు వరుసలో మహిళా ఎంపీలను మోహరించడం ద్వారా మార్షల్స్ వారిని తాకకుండా అడ్డుకోవచ్చని, ఆ గ్యాప్‌లో ప్రధాని పీఠం వద్దకు దూసుకెళ్లవచ్చని వ్యూహం రచించినట్లు నిఘా వర్గాలు స్పీకర్‌కు నివేదించాయి. నిరసన ముసుగులో ప్రధానిపై భౌతిక దాడి జరిగే అవకాశం ఉందని ఐబీ (IB), ఇతర భద్రతా సంస్థలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. సభలో ప్రధానికి ఉండే భద్రత కంటే, సభ్యుల ముసుగులో వచ్చే ముప్పును అడ్డుకోవడం కష్టమని భావించారు.
ప్రధాని ప్రసంగించకుండానే తీర్మానం ఆమోదించడం అనేది అరుదైన, సంచలన నిర్ణయం. అయితే, స్పీకర్ ఓం బిర్లా ముందున్న ప్రత్యామ్నాయాలు చాలా తక్కువ. బుధవారమే ఈ సమాచారం అందడంతో, పరిస్థితిని సమీక్షించిన స్పీకర్ సభను వాయిదా వేశారు. గురువారం కూడా ప్రతిపక్ష సభ్యుల బాడీ లాంగ్వేజ్, సభలో వారి మోహరింపు అనుమానాస్పదంగా ఉండటంతో, రిస్క్ తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయం సిద్ధపడలేదు. నిజానికి ప్రధాని మోదీ ప్రసంగించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ, సభా మర్యాదలకు భంగం కలగడమే కాకుండా, దేశ ప్రధాని భద్రతకు ముప్పు వాటిల్లితే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని భావించిన ప్రభుత్వం, వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది.
ఈ పరిణామం భారత రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. చట్టసభలు చర్చలకు వేదికలు కావాలి. కానీ, దేశ ప్రధాని మాట్లాడే అవకాశం లేని పరిస్థితి కల్పించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. ప్రతిపక్షం ఒకవేళ నిజంగానే ఇలాంటి ‘దాడి’కి ప్లాన్ చేసి ఉంటే, అది ఆ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధాని ప్రసంగం లేకపోవడాన్ని ప్రతిపక్షాలు “ప్రధాని భయపడి పారిపోయారు” అని ప్రచారం చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం “ప్రజాస్వామ్య ముసుగులో హింసను ప్రేరేపిస్తున్నారు” అని కౌంటర్ ఇస్తోంది.
పార్లమెంటు లోపల భద్రతను పర్యవేక్షించే పార్లమెంటరీ సెక్యూరిటీ సర్వీస్ ఈ ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక ఎంపీ లేదా ఒక సమూహం ప్రధానిపై దాడికి ప్లాన్ చేశారన్న వార్త నిజమని తేలితే, సంబంధిత సభ్యులపై అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉంది. ప్రధాని ప్రసంగం లేని ధన్యవాద తీర్మానం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, భారత పార్లమెంటులో పెరిగిపోతున్న ఉద్రిక్తతలకు పరాకాష్ట.






