Russia: భారత చమురు అవసరాలను అమెరికా తీర్చగలదా..?
రష్యానుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా ప్రకటించారు. అంతేకాదు.. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తుందని.. ఫలితంగా ఉక్రెయిన్ యుద్ధం నుంచి రష్యా శాంతి దిశగా ప్రయాణిస్తుందన్నారు ట్రంప్. అయితే.. ట్రంప్ అనుకున్నత ఈజీగా.. భారత అవసరాలను అమెరికా తీర్చలేదంటున్నారు విశ్లేషకులు.
ట్రంప్(TRUMP) వ్యాఖ్యలపై రష్యా అత్యంత వ్యూహాత్మకంగా స్పందించింది. భారత్ తన చమురు అవసరాల కోసం ఇతర దేశాల వైపు చూడటం కొత్తేమీ కాదని, అది తమకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. అయితే, చమురు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు న్యూఢిల్లీ నుంచి తమకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని ఆయన స్పష్టం చేశారు.
రష్యా ఇచ్చే భారీ స్థాయి చమురును అమెరికా భర్తీ చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యమని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రస్తుతం రష్యా నుంచి రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. అమెరికా సరఫరా చేసే తేలికపాటి చమురు భారతీయ రిఫైనరీలకు సరిపోదని, రష్యా ఇచ్చే యురల్స్ గ్రేడ్ చమురుకు అది ప్రత్యామ్నాయం కాలేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
నిజానికి 2021 వరకు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమే ఉండేది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా రాయితీపై చమురు ఇవ్వడంతో భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి లేదా వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా భారత్ తన దిగుమతులను వైవిధ్యపరుస్తోంది. ఒకవేళ రష్యా సరఫరాను నిలిపివేస్తే, గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్ల వరకు పెరిగి, అమెరికాలోనే పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.






