Tulsi Gabbard: ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయా? తులసి వ్యాఖ్యలతో రాజకీయ రగడ

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVM)పై అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard) చేసిన వ్యాఖ్యలు భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈవీఎంల భద్రతపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, గబ్బార్డ్ వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి ముందుకు తెచ్చాయి. తులసి గబ్బార్డ్ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈవీఎంల హ్యాకింగ్ (EVM Hacking)పై మాట్లాడారు. ఎలక్షన్ ఓటింగ్ సిస్టమ్స్ లో హ్యాకింగ్ కు సంబంధించిన తమ కార్యాలయం కొన్ని ఆధారాలను సేకరించిందని చెప్పారు. ఓట్ల ఫలితాలను మార్చేందుకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయని ఆవిడ వెల్లడించారు. EVMల బదులు బ్యాలెట్ (Ballot Paper)కు మారాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్ ను ఉద్దేశించినవి.
అయితే భారత్‌లో ఈవీఎంలపై తులసి గబ్బార్డ్ మాట్లాడారనేలా కొంతమంది రచ్చ మొదలు పెట్టారు. తాము మొదటి నుంచి హ్యాకింగ్ పైన మాట్లాడుతున్నామని.. ఇప్పుడు అమెరికా కూడా ఈ విషయం చెప్తోందనేలా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి భారత ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో భారత ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. భారత్ లో వినియోగిస్తున్న EVMలు ఇంటర్నెట్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్‌తో లాంటి వాటితో కనెక్ట్ కావని.. వీటిని మ్యానిపులేట్ చేయడం అసాధ్యమనీ వివరణ ఇచ్చింది. సరళమైన, ఖచ్చితమైన కాలిక్యులేటర్‌ల లాగా ఇవి పని చేస్తాయని చెప్పింది. EVMలకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్స్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) స్లిప్స్ ద్వారా పరీక్షించబడతాయని వివరించింది. గతంలో ఐదు కోట్లకు పైగా VVPAT స్లిప్స్ EVM ఓట్లతో సరిపోలినట్లు ECI పేర్కొంది. గబ్బార్డ్ వ్యాఖ్యలు భారత ఈవీఎంలను ఉద్దేశించినవి కాదని, అమెరికాలోని సంక్లిష్ట ఎన్నికలక వ్యవస్థ గురించి మాట్లాడినవని ఈసీఐ స్పష్టం చేసింది.
భారత్‌లో ఈవీఎంలపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్, వైసీపీ, సమాజవాదీ పార్టీ వంటి పార్టీలు ఈవీఎంలను కొంతమంది మేనేజ్ చేస్తున్నారని.. ఫలితాలను మార్చేస్తున్నారని ఆరోపించాయి. అయితే, ఈ ఆరోపణలను నిరూపించే ఆధారాలు ఎవరూ సమర్పించలేదు. 2019, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఆరోపణలు మరింత ఊపందుకున్నాయి. ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమని చెప్పిన వారిలో టెక్ మాగ్నేట్ ఎలన్ మస్క్ కూడా ఉన్నారు, అయితే ఆయన వ్యాఖ్యలను ఈసీఐ తిరస్కరించింది.
గబ్బార్డ్ వ్యాఖ్యలు భారత్ ఈవీఎంలపై కాకపోయినా, సోషల్ మీడియాలో వీటిని భారత ఈవీఎంలతో ముడిపెట్టి ప్రచారం జరిగుతోంది. కొందరు నాయకులు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికి వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ఈసీఐ, కేంద్ర ప్రభుత్వం గబ్బార్డ్ వ్యాఖ్యలపై స్పందించాలని, దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గబ్బార్డ్ వ్యాఖ్యలు అమెరికా ఈవీఎంల భద్రతకు సంబంధించినవి కాగా.. వాటిని భారత ఈవీఎంలకు ముడిపెట్టి మళ్లీ రచ్చ రాజేస్తున్నారు. అయితే ఈవీఎంలపై ఆరోపణలు చేసిన వారెవరూ ఇప్పటివరకూ ఆధారాలు సమర్పించలేకపోయారు.