TTD: రాజకీయ పోరాటం నుంచి మీడియా వార్ దిశగా మలుపు తీసుకున్న బి.ఆర్ నాయుడు, సాక్షి వివాదం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మీడియా, అధికారాల మధ్య జరుగుతున్న వాగ్వాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu) , జగన్ (Jagan) కుటుంబ యాజమాన్యంలోని సాక్షి (Sakshi) మీడియా మధ్య ఘర్షణ మరింతగా పెరిగింది. బీఆర్ నాయుడు తనపై సాక్షి పత్రిక, ఛానల్ ప్రసారం చేసిన వార్తలు తన గౌరవానికి భంగం కలిగించాయని ఆరోపించారు. ఈ నెల 10, 14 తేదీల్లో వచ్చిన కథనాలు తనను అవమానించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ, ఆయన పరువు నష్టం దావా వేశారు. క్షమాపణ చెప్పాలని ..లేని పక్షంలో రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ఇలా జరగకపోతే న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
దీనికి ప్రతిస్పందనగా సాక్షి యాజమాన్యం మాత్రం తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. ‘ఎలాంటి ఒత్తిడులు, ఉడత ఊపులు మాకు భయం కలిగించవు’ అని వారు స్పష్టం చేశారు. అంతేకాదు, బీఆర్ నాయుడు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ (TTD)లో పరిస్థితులు దిగజారాయని మళ్లీ ఆరోపించారు. ప్రజలకు, ముఖ్యంగా భక్తులకు సరైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతోనే తమ ప్రయత్నం కొనసాగుతుందని, టీటీడీని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలనేదే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలతో వివాదం మరింత ముదురుతోంది. సాక్షి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని బీఆర్ నాయుడు మండిపడుతుండగా, మరోవైపు తాను టీవీ5 (TV5) చైర్మన్‌గా ఉన్నప్పటికీ టీటీడీ బాధ్యతలు నిర్వర్తించడంలో ఎటువంటి లోపం కనబరచడం లేదని తన విధిని పూర్తి నిబద్ధతతో నెరవేరుస్తున్నానని ఆయన వాదిస్తున్నారు. కొన్ని సంఘటనలు జరిగాయన్న విషయాన్ని ఆయన ఒప్పుకుంటున్నా, అవి ఉద్దేశపూర్వకంగా జరిగాయని కాదు, ప్రమాదవశాత్తూ జరిగాయని చెబుతున్నారు. అయినప్పటికీ సాక్షి తనను లక్ష్యంగా చేసుకుని నిరంతరం దూషణాత్మక రీతిలో కథనాలు రాస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇంకా ముందుకు వెళ్లి, సాక్షి ప్రసారాలను నిలిపివేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (Ministry of Information and Broadcasting)ను కూడా సంప్రదిస్తానని బీఆర్ నాయుడు ప్రకటించడం విశేషం. ఒక మీడియా సంస్థ చైర్మన్‌గా ఉన్న ఆయన మరో మీడియా చానల్ అనుమతి రద్దు కోరడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇంతకు ముందే టీవీ5 యాజమాన్యం కూడా సాక్షి, వైసీపీ (YSRCP) నాయకులపై పరువు నష్టం దావాలు వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీటీడీ తరఫున బీఆర్ నాయుడు నోటీసులు పంపడం, తన మీడియాను చూసి భరించలేకే సాక్షి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించడం రెండు మీడియా సంస్థల మధ్య ఉన్న పోటీని మరింత బహిర్గతం చేస్తోంది.
దీంతో ఈ వ్యవహారం కేవలం వ్యక్తిగత లేదా సంస్థల మధ్య విభేదంగా మిగిలిపోకుండా రాజకీయ వాతావరణాన్నే వేడెక్కిస్తోంది. సాక్షి మీడియా వెనుక జగన్ కుటుంబం ఉండటంతో, అధికార–విపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటం ఇప్పుడు మీడియా యుద్ధంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, ఎవరికి ఎంత వరకూ నష్టం కలిగిస్తుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.