పుల్వామా దాడి పాక్ కొంప ముంచిందా..?
పుల్వామా దాడి సమయంలో పాకిస్తాన్ చంకలు గుద్దుకుంది. ఉగ్రవాదులను పంపి దాడులు చేయించామని.. జబ్బలు చరుచుకుంది. కానీ తర్వాతే… తెలిసింది దాయాదికి.. తామెంత తప్పు పనిచేశామో.. ? తమ ప్రతాపం తాము చూపించామనుకుంది కానీ..దీనికి భారత్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో గ్రహించలేదు. ఇప్పుడు చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది పాక్ పరిస్థితి. ముందుకెళ్లలేక, వెనక్కు రాలేక అన్నట్లుగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ తెలిపారు. అందుకే ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీకి శనివారం ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
‘‘పుల్వామా ఘటన తర్వాత పాక్ నుంచి వచ్చే దిగుమతులుపై 200 శాతం సుంకం విధించాలని భారత్ నిర్ణయించింది. కశ్మీర్ బస్సు సేవలను నిలిపివేసింది. సరిహద్దు వెంట వాణిజ్య కార్యకలాపాలను ఆపేసింది’’ అని ఇషాక్ తెలిపారు. భారత్ సహా పొరుగు దేశాలతో పాక్ ఎదుర్కొంటున్న సవాళ్లేంటని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరణ విషయంలో పాక్ వ్యాపార వర్గాలు ఆతృతగా ఉన్నాయని మార్చిలో లండన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఇషాక్ అన్నారు. అనంతరం భారత్‌తో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రణాళికలేవీ లేవని ఆయన కార్యాలయం మరో ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే విధానానికి స్వస్తి పలకాలని భారత్ డిమాండ్ చేస్తోంది. తద్వారా ఇతర సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణాన్ని కల్పించే బాధ్యత పాక్‌పైనే ఉందని స్పష్టం చేస్తూ వస్తోంది. దాయాది దేశం మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. పైగా తమ భూభాగం నుంచి ఉగ్రకార్యకలాపాలు కొనసాగడం లేదంటూ వితండవాదం చేస్తోంది.






