9 Targets: ఆ 9 స్థావరాలనే భారత్ ఎందుకు టార్గెట్ చేసింది..?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో (Pahalgam Terror Attack) ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మృతి చెందారు. ఈ దాడి భారత్‌ను కలిచివేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో (Pak Terrorists) జరిగిన ఈ దాష్టీకానికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టింది. ఈ అర్ధరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడులు జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్‌లకు చెందిన స్థావరాలపై జరిగాయి. ఈ 9 స్థావరాలనే భారత్ ఎందుకు లక్ష్యంగా చేసుకుందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
భారత్ టార్గెట్ చేసిన 9 స్థావరాలు భారత వ్యతిరేక ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. ఈ స్థావరాలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో, దాడులను ప్లాన్ చేయడంలో, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంలో, ఆయుధాలను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్-RAW అందించిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ లక్ష్యాలను ఎంచుకున్నారు. ఈ స్థావరాలు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల ఉగ్రవాదులు సులభంగా భారత్‌లోకి చొరబడేందుకు వీలు కల్పిస్తున్నాయి.
1. బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్ అల్లా: జైషే మహ్మద్‌కు చెందిన ఈ స్థావరం అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే చీఫ్ మసూద్ అజహర్ నేతృత్వంలో ఈ క్యాంప్ 2001 భారత పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి ఘోర ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఈ స్థావరంలో శిక్షణ కేంద్రాలు, ఆయుధ గిడ్డంగులు ఉన్నాయి.
2. మురిద్కేలోని మర్కాజ్ తోయిబా: లష్కరే తోయిబా హెడ్‌క్వార్టర్స్ గా పిలిచే ఈ స్థావరం సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2008 ముంబయి దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. ఈ క్యాంప్‌లో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, శిక్షణ, లాజిస్టిక్స్ కార్యకలాపాలు జరుగుతాయి.
3. సియల్‌కోట్‌లోని మెహ్‌మూనా జోయా: హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఈ క్యాంప్ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. నివాస ప్రాంతాల మధ్య ఉండటం వల్ల ఇది ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయంగా మారింది. ఈ స్థావరం జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇస్తోంది.
4-5. కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్, మస్కర్ రహీల్ షహీద్: ఈ రెండు స్థావరాలు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్నాయి. మర్కాజ్ అబ్బాస్ 2023లో పూంచ్, రియాసీలో జరిగిన దాడులకు కారణమైన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది. మస్కర్ రహీల్ షహీద్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వ ఉంది.
6-7. ముజఫరాబాద్‌లోని షవాయ్ నల్లాహ్, సైద్నా బిలాల్: షవాయ్ నల్లాహ్ లష్కరే తోయిబాకు చెందిన కీలక స్థావరం, 2000 నుంచి ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, శిక్షణకు కేంద్రంగా ఉంది. సైద్నా బిలాల్ జైషే మహ్మద్‌కు చెందిన రవాణా క్యాంప్‌గా, 50-100 మంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది.
8. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదిత్: ఈ లష్కరే స్థావరం పూంఛ్, రాజౌరి, రియాసీ సెక్టార్‌లలో ఉగ్రవాదులను, ఆయుధాలను పంపడానికి ఉపయోగపడుతోంది.
9. తెహ్రా కలాన్‌లోని సర్జల్: జైషే మహ్మద్‌కు చెందిన ఈ స్థావరం జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను తరలించడానికి కీలకంగా ఉంది.
ఈ స్థావరాలను ఎంచుకోవడంలో భారత్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్యాంపులు భారత్‌పై దాడులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల ఉగ్రవాదులు సులభంగా చొరబడే అవకాశం ఉంది. ఈ స్థావరాలు జైషే, లష్కరే, హిజ్బుల్‌లకు చెందిన కీలక నాయకులు, శిక్షణ కేంద్రాలు, ఆయుధ నిల్వలను కలిగి ఉన్నాయి. ఈ దాడుల ద్వారా ఉగ్రవాద సంస్థల ఆపరేషనల్ సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీయడం భారత్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, హామర్ స్మార్ట్ బాంబులను ఉపయోగించింది. ఈ దాడులు 25 నిమిషాల్లో పూర్తయ్యాయి. 80-90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పౌరులకు హాని కలగకుండా, పాకిస్థాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయకుండా భారత్ జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఖచ్చితమైన, నీతిమంతమైన సమాధానం భారత ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని, బాధ్యతాయుత వైఖరిని ప్రపంచానికి చాటింది.