బిహార్ కు ప్రత్యేక హోదా లేనట్లే..

ప్రత్యేక హోదా కోసం బిహార్ ప్రభుత్వం చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై సోమవారం లోక్‌సభలో స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. బడ్జెట్ పార్లమెంటు సమావేశాలకు సన్నాహకంగా ఆదివారం జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో ఎన్డీయే ముఖ్య భాగస్వామి, బిహార్ అధికార పక్షం జేడీయూ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది. ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్యాకేజీని బిహార్ నుంచి జార్ఖండ్‌ను విభజించిన నాటి నుంచీ తాము కోరుతున్నామని జేడీయూ నేత మనోజ్‌కుమార్ ఝా వివరించారు.
‘‘కేంద్రం బిహార్‌ను చౌక శ్రమల సరఫరాదారుగానే చూస్తోంది. ఆ దృష్టి మారాలన్నారు.. రాజకీయాలకు అతీతంగా మేం.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర విధానం మారాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండూ బిహార్‌కు ఇవ్వాల్సిందే’’నని ఆయన స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై తన పాత వైఖరినే మోడీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. బిహార్ కు ఆ అర్హత లేదని స్పష్టం చేసింది.
పర్వత ప్రాంతాలు, తక్కువ జనాభా, అధిక సంఖ్యలో గిరిజన జనాభా, సరిహద్దులు, ఆర్థిక, మౌలికసదుపాయాల్లో వెనుకబాటుతనం, రాష్ట్ర నిధులు ఏ మాత్రం సరిపోకపోవడం వంటి సమస్యలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా కల్పించాలని జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. ఈ లక్షణాలు బిహార్‌కు లేవని, అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించదని తెలిపారు. కాగా, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా పొందే అర్హత లేదు.