భారత్ తో పెట్టుకుంటే అంతేమరి..!
భారత ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనపై నోటిదురుసు వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు దానికి తగిన ఫలితం చెల్లించుకుంటోంది. ఏటా అత్యధికస్థాయిలో భారత్ నుంచి పర్యాటకులు వస్తుండడంతో.. మాల్దీవులు ఆర్థికంగా సుభిక్షంగా ఉండేది. అయితే ఒక్కసారిగా మాల్దీవుల నేతల అనుచిత వ్యాఖ్యలు .. భారతీయులను షాక్ కు గురిచేశాయి. పెద్దన్నగా ఉంటూ అండగా నిలిచిన భారత్ పై.. మాల్దీవులవ్యాఖ్యలు ఇండియాలో సెగరగిల్చాయి. ఇంకేముంది బాయ్ కాట్ మాల్దీవులు, లక్షద్వీప్ చూసొద్దామంటూ పెనుస్థాయిలో ట్రోలింగ్ నడిచింది.
మాల్దీవుల పర్యాటకంలో అగ్రస్థానంలో నిలిచిన భారతీయులు.. ఆదేశ ఆతిథ్యాన్ని వద్దనుకున్నారు. ఫలితంగా తొలిస్థానం నుంచి భారత్ ఏకంగా ఆరోస్థానానికి పడిపోయింది. దీంతో అక్కడి హోటల్స్, ట్రాన్స్ పోర్ట్, ఆహారం, ఇతర రంగాలపై గట్టిదెబ్బే పడింది. ఈ పరిణామాలకు తోడు .. భారత సైన్యం వెనక్కు పోవాలంటూ అల్టిమేటమిచ్చింది మాల్దీవులు. దీంతో పీటముడి మరింత బిగిసింది. అన్నట్లుగానే భారత్ తన సైన్యాన్ని వెనక్కు రప్పించింది. ఇప్పుడు భారత్ స్థానాన్ని చైనాతో పూరిద్దామంటే.. అది అనుకున్నట్లుగా జరగడం లేదు.
ఇక ఆపదసమయంలో ఆదుకున్న భారత్ కు మాల్దీవులు .. భారీగా రుణపడి ఉంది. ఆ రుణాన్ని చెల్లించాలంటే ఆదేశ ఆర్థిక వ్యవస్థ కూడా సరిపోని పరిస్థితి. దీంతో రుణచెల్లింపు విషయంలో ఉదారంగా వ్యవహరించాలని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భారత్ కు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో అడ్డదిడ్డంగా మాట్లాడిన మంత్రులపై వేటేశారు. అయినా భారతీయుల ఆగ్రహం చల్లారలేదు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, మాజీ విదేశాంగమంత్రి కూడా .. తమపై వ్యతిరేక భావం చూపొద్దని భారత్ కు పలుమార్లు సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు.
భారత్‌లో పర్యటించిన ఆయన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టంచేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. ఇటువంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో అపార్థాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆ దశను దాటేశాం. భారత్-మాల్దీవుల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి’’ అని వెల్లడించారు.






