ISI Spy Network: భారత్‌లో భారీగా పాకిస్తానీ నెట్ వర్క్..! దేశభద్రతకు పెను సవాల్..!!

భారతదేశంలో గూఢచర్యం (spy) ఆరోపణలపై దేశవ్యాప్తంగా 12 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశంలో ఆందోళన కలిగిస్తోంది. అరెస్టయిన వారిలో యూట్యూబర్లు, విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులు, వ్యాపారులు వంటి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఈ కేసులో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కీలక పాత్రధారిగా ఉందని, ఆమె నుంచి మొదలైన ఈ గూఢచర్యం నెట్‌వర్క్ ఇంకా విస్తరిస్తోందని నిఘా సంస్థలు తెలిపాయి. ఈ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది.
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ప్రముఖ ట్రావెల్ బ్లాగర్‌గా సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఆమెను ఈ నెల 17న హిసార్ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్టు చేశారు. జ్యోతి పాకిస్తాన్‌లోని (Pakistan) కొందరు వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉందని, ఆమె అనేక సార్లు పాకిస్తాన్, చైనాలను సందర్శించినట్లు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణలో ఆమె పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలు కలిగి ఉందని, సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంపుతోందని గుర్తించారు.
జ్యోతితో పాటు మరో ఆరుగురు భారతీయులను అధికారులు అరెస్టు చేశారు. వీరంతా పాక్ ISI ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తూ భారతదేశంలోని కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జ్యోతి మల్హోత్రాతో మొదలైన విచారణ, ఇప్పటి వరకు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 11 మంది గూఢచారులను గుర్తించడానికి దారితీసిందని నిఘా వర్గాలు తెలిపాయి. అరెస్టయిన 12 మందిలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. దీన్ని బట్టి ఈ గూఢచర్యం నెట్‌వర్క్ ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. వీళ్లంతా సున్నితమైన సమాచారాన్ని సేకరించి, పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారంలో సైనిక స్థావరాలు, రక్షణ వ్యవస్థలు, కీలకమైన రాజకీయ పరిణామాలు వంటి అంశాలు ఉన్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వీడియోలను అప్‌లోడ్ చేసేది. ఈ వీడియోల ద్వారా ఆమె కీలక స్థలాల సమాచారాన్ని సేకరించి, ISIకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు వీడియోల ద్వారా తెలస్తోంది. ఇతర అరెస్టయిన వారిలో కొందరు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ, సైనిక స్థావరాల సమీపంలో సమాచారాన్ని సేకరించినట్లు గుర్తించారు. విద్యార్థులు, వ్యాపారులు కూడా వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని బదిలీ చేసినట్లు నిఘా సంస్థలు పేర్కొన్నాయి.
అరెస్టయిన వ్యక్తులు పాకిస్తాన్ ISIతో నేరుగా లేదా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. జ్యోతి మల్హోత్రా పలుమార్లు పాకిస్తాన్‌ను సందర్శించడం, అక్కడి వ్యక్తులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం ద్వారా ఈ నెట్‌వర్క్ లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వీళ్లంతా సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా సమాచారాన్ని బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గూఢచర్యం ఆరోపణలు దేశ భద్రతకు సవాలుగా మారాయి. జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి, భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఈ ఘటనలకు అదనపు నేపథ్యాన్ని అందించాయి. ఈ నేపథ్యంలో భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.