Bengal: ‘తీస్తా ప్రహార్’.. బెంగాల్ లో ఇండియన్ ఆర్మీ భారీ సైనిక విన్యాసాలు
భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో .. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కాచుకునేందుకు ఇండియన్ ఆర్మీ (Indian Army) సర్వసన్నద్ధమవుతోంది. ఓ వైపు దౌత్య మార్గాల్లో దాయాదికి ఉచ్చు బిగిస్తున్న భారత్.. బెంగాల్‌లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ‘ తీస్తా ప్రహార్’ పేరుతో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి? శత్రువు వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై కసరత్తు చేసింది. ఆయుధ సరఫరా, సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించింది.
ఇటీవల భారత సైన్యంలోకి అత్యాధునిక సాంతకేతిక వ్యవస్థ, ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో వాటిని వినియోగించడం, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టిసారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్నదానిపై సైన్యం కసరత్తు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో వేగంగా, సమర్థంగా లక్ష్యాలను ఛేదించడంపై రిహార్సల్స్ చేశారు. శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది.
మనదేశ ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్(bangladesh) తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్(Yunus) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్, నేపాల్, భారత ఈశాన్య రాష్ట్రాల మధ్య సమగ్ర ఆర్థిక సమైక్యత కోసం ఒక ప్రణాళిక అవసరమని ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ పట్ల ఆయన వైఖరి తరచూ వార్తల్లో నిలుస్తోంది.
చైనాలో పర్యటించినప్పుడు కూడా ఆయన భారత ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత నెలలో చైనా పర్యటన సందర్భంగా కూడా మహమ్మద్ యూనస్ భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో చైనా తన కార్యకలాపాలను విస్తరించుకోవచ్చని ఆహ్వానించిన ఆయన “భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను ‘సెవెన్ సిస్టర్స్’ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారికి సముద్ర మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే ద్వారం. ఇది చైనాకు ఆర్థికంగా విస్తరించడానికి గొప్ప అవకాశం” అని వ్యాఖ్యానించినట్లుగా ఒక వీడియో విస్తృతంగా ప్రచారమైంది.






