మాల్దీవులకు సాయం వెనక….?
భారత్ ప్రధానమంత్రిపైనే సెటైర్లు .. భారతీయులు నాగరికతకే ప్రశ్నలు..అంతేనా.. చైనా అనుకూల వైఖరితో అన్నలా వ్యవహరిస్తున్న భారత్ కు ఇబ్బంది పెడుతూ రావడం.. ఇవన్నీ మాల్దీవుల నూతన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. చైనా అండ చూసుకుని భారత్ ను దూరం పెట్టారు నూతన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు. భారత సైన్యాన్ని ఓ డెడ్ లైన్ పెట్టి మరీ .. తమదేశం నుంచి బయటకు పంపించారు.
ఈ చర్యలన్నింటినీ భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ వస్తోంది. ఇటీవలి కాలంలో చైనా స్పై షిప్.. మాల్దీవుల జలాల్లో చక్కర్లు కొట్టింది. దీనితో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై మాలేకు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే దీన్ని మాల్దీవులు కొట్టిపడేసింది. ఈ దశలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు.. మాజీమంత్రులు, నేతలు.. భారత్ ను తమపై ఆగ్రహించవద్దని కోరారు. తమ సహాకారాన్ని కొనసాగించాలని విజ్ఞప్తులు సైతం చేశారు.
అయితే ప్రభుత్వాలు ఉన్నట్లుగా ప్రజలు ఉండరుగా.. తమప్రభుత్వంపై మాల్దీవుల మంత్రులు చేసిన ప్రకటనలు.. భారతీయులకు మంటపుట్టించాయి. బాయ్ కాట్ మాల్దీవులు అని విపరీతంగా ట్రెండింగ్ అయింది. అంతే భారతీయ ప్రముఖులు..రూటు మార్చారు. మాల్దీవుల స్థానంలో లక్షద్వీప్, ఇతర దేశాల టూరిస్టు ప్లేసులను ఎంపిక చేసుకున్నారు. ఫలితంగా మాల్దీవుల పర్యాటక ఆదాయం ఒక్కసారిగా దెబ్బతింది. ఆ స్థానంలో తమ పౌరులను పంపాలని చైనా ప్రభుత్వానికి నేరుగా మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు విజ్ఞప్తి చేసినా పెద్దగా ఫలితంగా లేకపోయింది.
అలాంటి సమయంలోనే భారత్ రుణ చెల్లింపుల అంశం .. మాల్దీవుల క్యాబినెట్ లో చర్చకు వచ్చింది. ఒక్కసారిగా రుణాన్నిచెల్లించాలంటే కష్టమన్న సంగతి గుర్తించిన మాల్దీవుల ప్రభుత్వం.. తమకు రుణాన్ని చెల్లించేందుకు గడువు కావాలని విజ్ఞప్తి చేసింది. దీంతో రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది భారత ప్రభుత్వం. వడ్డీలేకుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చు. ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది. భారత్ అందించిన ఆర్థిక సాయంపై మాల్దీవుల విదేశాంగశాఖ మంత్రి మూసా జమీర్ స్పందించారు. భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఒక్కసారిగా భారత విదేశాంగవిధానంలో మార్పు తేవడం సరికాదన్నది సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోంది..దీనికి తోడు మాల్దీవులతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఈపరిస్థితుల్లో మాల్దీవులను నెమ్మదిగా దారికి తెచ్చుకునేందుకు సరైన అవకాశాల కోసం ఢిల్లీ ఎదురుచూస్తోంది. ఇప్పుడీ రుణం చెల్లింపు అంశం కూడా ఇందులోకి వస్తుందని చెప్పవచ్చు. వచ్చే ఏడాది మాత్రం ఆరుణాన్ని కొత్తప్రభుత్వం చెల్లించగలదా అంటే అదీ అనుమానమే. అప్పుడు తప్పనిసరిగా మాల్దీవులకు మరోసారి భారత ప్రభుత్వంతో సత్సంబంధాల అవసరం ఉంటుందన్నది ఢిల్లీ అభిమతంగా కనిపిస్తోంది.






