భారత్ దెబ్బకు తలపట్టుకున్న ఐసిసి…ఇప్పుడేం చేద్దాం…?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు టోర్నమెంట్ నిర్వహిస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వచ్చేది లేదు అంటూ భారత్ పట్టుదలగా ఉంది. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నామని చెప్తోంది. ఇక హైబ్రీడ్ మోడల్ కు పాకిస్తాన్ అంగీకరించడం లేదు. ఈ టైం లో మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్… తిరిగి ఢిల్లీ లేదా చండీగడ్ వెళ్లిపోవచ్చు అని… భద్రతకు తాము హామీ ఇస్తున్నామని పాకిస్తాన్ చెప్తోంది.
భద్రతా కారణాలతో తాము పాక్ లో అడుగు పెట్టేది లేదని భారత్ చేసిన ప్రకటన తర్వాత పాకిస్తాన్ సందిగ్దంలో పడింది. ఈ నేపధ్యంలో పాక్ క్రికెట్ బోర్డ్ కీలక అడుగు వేసింది. ఇతర జట్లు భారత్ వస్తాయా లేదా అని ప్రశ్నించింది. ఈ మేరకు ఐసిసి నుంచి వ్రాతపూర్వక వివరణ కోరింది. హైబ్రిడ్ మోడల్ తాము అంగీకరించడం లేదని కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ వైఖరి కారణంగా… ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన ఆగిపోయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. భారత్ పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఇష్టపడటం లేదనే విషయం గతంలో కూడా స్పష్టంగా చెప్పింది.
ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య వైరం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు తలనొప్పిగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై బ్రాడ్కాస్టర్లు, వ్యాపార భాగస్వాములు పెద్ద ఎత్తున ఖర్చు చేసారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్రాడ్కాస్టర్లు ఇప్పటికే ఐసిసిని హెచ్చరించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. భారత్ అంగీకరించకపోవడం, హైబ్రీడ్ మోడల్ కు పాక్ నో చెప్పడంతో… పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయడంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాధ్యత తీసుకోవాల్సి ఉంది.
ఈ తరుణంలో ఐసిసి నుంచి కొందరు ప్రతినిధులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తో రాజీకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. హైబ్రీడ్ మోడల్ ను అంగీకరించకపోతే అనవసర సమస్యలు వచ్చే అవకాశం ఉందని దయచేసి… అంగీకరించాలని కోరుతున్నారు. పాకిస్తాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపని భారత్… అవసరమైతే టోర్నీ నుంచి బయటకు రావడానికి సిద్దంగా ఉంది. దీనితో భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉండటంతో ఐసిసి జాగ్రత్తలు పడుతోంది. రానున్న రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.






