Maran Brothers: మారన్ బ్రదర్స్ మధ్య ఆస్తి గొడవలు.. సన్ టీవీ కుటుంబంలో సంచలనం!!
భారతీయ మీడియా రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన సన్ టీవీ నెట్వర్క్ (Sun TV Network) కుటుంబంలో సోదరుల మధ్య వివాదం చెలరేగింది. డీఎంకే ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ (Dayanidhi Maran) తన అన్నయ్య, సన్ టీవీ నెట్వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్‌పై (Kalanidhi Maran) సంచలన ఆరోపణలు చేశారు. మోసం, క్రిమినల్, ట్రస్ట్ ఉల్లంఘన, మోసగించడం వంటి తీవ్ర ఆరోపణలతో ఆయన ఒక లీగల్ నోటీసు పంపించారు. కళానిధి మారన్ భార్య కావేరి మారన్ (Kaveri Maran) సహా ఏడుగురు ఇతరుల పేర్లు కూడా ఈ నోటీసులో ఉన్నాయి. సన్ టీవీ యాజమాన్యంలో షేర్ల దుర్వినియోగం, ఆర్థిక అవకతవకల చుట్టూ ఈ వివాదం తలెత్తింది.
2003లో మారన్ సోదరుల తండ్రి, సన్ టీవీ వ్యవస్థాపకుడు మురసోలి మారన్ (Murasoli Maran) మరణించారు. ఆ తర్వాత, కుటుంబ వ్యాపారంలో షేర్ల బదిలీ విషయంలో అనేక అవకతవకలు జరిగాయని దయానిధి ఆరోపిస్తున్నారు. మురసోలి మరణం తర్వాత, తల్లి మల్లికా మారన్‌కు (Mallika Maran) షేర్లు బదిలీ చేయబడ్డాయి. కానీ ఈ బదిలీకి అవసరమైన మరణ ధృవీకరణ పత్రం లేదా చట్టపరమైన వారసత్వ పత్రం లేకుండానే జరిగిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ చర్య కళానిధి మారన్ కు అనుకూలంగా జరిగిందని, కంపెనీపై ఆయన ఆధిపత్యం కొనసాగేలా చేసిందని దయానిధి వాదిస్తున్నారు.
2003 సెప్టెంబర్‌లో కళానిధి మారన్ 12 లక్షల ఈక్విటీ షేర్లను టీవీ నెట్వర్క్ లిమిటెడ్‌లో తనకు తానే కేటాయించుకున్నారు. ఈ షేర్లు ఒక్కొక్కటి రూ.10 నామమాత్ర విలువతో కేటాయించుకున్నారు. అయితే అప్పటి మార్కెట్ విలువ రూ.2,500 నుంచి రూ.3,000 వరకు ఉందని అంచనా. దీని ద్వారా కళానిధి మారన్ టీవీ నెట్ వర్క్ లో 60శాతం హక్కులను దక్కించుకున్నారని దయానది ఆరోపిస్తున్నారు. అది కూడా సరైన విలువ లేదా షేర్‌హోల్డర్ల సమ్మతి లేకుండా జరిగిందనేది ఆయన ఆరోపణ. కంపెనీ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, కొత్త మూలధనం అవసరం లేనప్పటికీ ఈ కేటాయింపు జరిగిందని దయానిధి పేర్కొన్నారు.
ఈ ఆరోపణలు ఇక్కడితో ఆగలేదు. కళానిధి మారన్ రూ.8,500 కోట్లకు పైగా భారతీయ, అంతర్జాతీయ REITలు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా మనీలాండరింగ్ చేశారని దయానిధి ఆరోపిస్తున్నారు. అలాగే సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు తప్పుదోవ పట్టించేలా డాక్యుమెంట్లు సమర్పించి కంపెనీ షేర్లను మోసపూరితంగా లిస్ట్ చేయడానికి కుట్ర పన్నినట్లు నోటీసులో పేర్కొన్నారు. కంపెనీ యాజమాన్యంలో అక్రమ నియంత్రణ సాధించడంతో పాటు, ఆర్థిక లాభాలను కుటుంబంలోని ఇతర సభ్యుల నుంచి దూరం చేయడానికి జరిగినవని దయానిధి వాదిస్తున్నారు.
సన్ టీవీ నెట్వర్క్ యాజమాన్యం 2003 నాటికి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే పునరుద్ధరించాలని దయానిధి మారన్ డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న షేర్లు, డివిడెండ్లు, ఆస్తులను తిరిగి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్లకు కళానిధి మారన్ స్పందించకపోతే, సివిల్, క్రిమినల్, రెగ్యులేటరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO)కి దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేయాలని దయానిధి ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం కళానిధి మారన్ సన్ టీవీ నెట్వర్క్ లో 75% వాటాను కలిగి ఉన్నారు. సుమారు 2.9 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. ఈ వివాదం కంపెనీ షేర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గురువారం సన్ టీవీ షేర్లు 0.74% తగ్గి రూ.613.50 వద్ద ముగిశాయి.
చెన్నైకి చెందిన లా ధర్మ లిటిగేషన్ సంస్థ ద్వారా జూన్ 10న దయానిధి మారన్ ఈ నోటీసు జారీ చేశారు. దీంతో సన్ టీవీ కుటుంబంలో తలెత్తిన విభేదాలను బయటికొచ్చాయి. కేవలం ఆస్తి, వ్యాపార విషయంతోనే కాకుండా, కుటుంబ సంబంధాలు, మీడియా సామ్రాజ్య భవిష్యత్తుపై కూడా ఇది ప్రభావం చూపనుంది.






