ఇండో పసిఫిక్ లో డ్రాగన్ వర్సెస్ పసిఫిక్…
ప్రపంచ సముద్ర వాణిజ్యరంగంలో కీలకమైన ఇండో-పసిఫిక్ పై ఆధిపత్యానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తన సముద్ర బలాన్ని అపారంగా పెంచుకుని, సముద్రతీరంపై పట్టుసాధించే దిశగా అడుగులేస్తోంది. మరోవైపు. చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా కార్యాచరణ సిద్ధం చేశాయి. అత్యాధునిక ఆయుధాలను ఆవిష్కరించాయి. సముద్రగర్భంలో రహస్యంగా సంచరించేలా సిద్ధం చేసిన ఈ అత్యాధునిక అండర్ వాటర్ డ్రోన్లకు ‘ఘోస్ట్ షార్క్’, ‘మాంటా రే’ అని పేర్లు పెట్టారు. వీటి రాకతో అగ్రరాజ్య సముద్రగర్భ యుద్ధతంత్రానికి పదును పెట్టినట్లైందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా జలాంతర్గాములు నీటి అడుగున ఉన్నప్పుడు కమ్యూనికేషన్ల కోసం చాలా విద్యుత్తు అవసరం. దీంతోపాటు చాలా డేటా వృథాగా మారిపోవడం, సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావం, స్టెల్త్ వంటివి కోల్పోవాల్సి ఉంటుంది. వీటిని అధిగమించేలా ఆస్ట్రేలియా ‘ఘోస్ట్‌షార్క్’ పేరిట దీర్ఘశ్రేణి అండర్‌వాటర్ డ్రోన్‌ను ఆవిష్కరించింది. ఇది ఇంటెలిజెన్స్, నిఘా అవసరాలను తీర్చడంతోపాటు.. దాడి చేయగల సామర్థ్యం కూడా దీని సొంతమని ఆ దేశాధికారులు వెల్లడించారు. ఇవి అమెరికా ఉపయోగించే ఆర్కా యూయూవీల కంటే తక్కువ సైజులో ఉన్నాయి.
ఇక అమెరికాకు చెందిన ఆయుధ తయారీ సంస్థ నార్తంత్రాప్ గ్రూమన్ సంస్థ మరో అండర్ వాటర్ అన్మ్యాన్డ్ వెహికల్‌ను తయారుచేస్తోంది. దీనిని ఏ మిషిన్కు వాడుతున్నారో దానికి సంబంధించిన ఆయుధాలు బిగించే అవకాశం ఉంది. ఈ మొత్తం యూయూవీని కేవలం ఐదు షిప్పింగ్ కంటైనర్లలో ఉంచి ఎక్కడికైనా తరలించవచ్చు. అక్కడ తిరిగి అసెంబ్లింగ్ చేసుకొని వాడుకోవచ్చు. ఫలితంగా దీనిని ఎక్కడ వినియోగించాలో దాని సమీపం వరకు విడిభాగాలుగా తరలించి.. అక్కడ అసెంబ్లింగ్ చేసి వాడుకోవచ్చు. అమెరికాకు చెందిన డార్ప సంస్థ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉంది. ఇటీవలే జల పరీక్షలు పూర్తి చేసుకొన్నట్లు డార్పా ప్రకటించింది.
ఇప్పటికే దాదాపు 300కుపైగా నౌకలతో అజేయ సముద్రశక్తిగా మారుతున్న చైనా కూడా ఈ రకం ఆయుధాల తయారీపై దృష్టిసారించింది. ఆర్కా తరహాలోనే చిన్న డ్రోన్‌ను గత 15 ఏళ్ల నుంచి రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ఆకస్ ఒప్పందం పేరిట జట్టు కట్టిన అమెరికా-ఆస్ట్రేలియాలు అణుజలాంతర్గాముల తయరీపై దృష్టిపెట్టాయి. తాజాగా ఇరుదేశాలు కలిసి సరికొత్త ఆయుధాలను ఆవిష్కరించడం చైనాకు ఇబ్బందికరగా మారింది.






