కేంద్రం నుంచి వరాలజల్లు.. ఏపీలో ఊరట..

రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఏ కూటమిని చూసి గంప గుర్తుగా ఓటు వేశారు.. ఇప్పుడు అదే కూటమి ఏపీ ప్రజలకు అండగా నిలబడుతుంది. భావితరాల భవిష్యత్తుపై ఆశా కిరణం ఉదయిస్తోంది. జగన్ పాలన అనంతరం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ఊరట అందిస్తోంది. అటు రాజధాని లేక ఇటు పోలవరం పూర్తి కాక.. నిధులు లేక ఎదురు చూస్తున్న తరుణంలో ఏపీకి మేలు జరుగుతుంది అన్న ఆశలు చిగురిస్తున్నాయి.
చంద్రబాబు సారథ్యంతో ఇప్పటికే పలు రకాల నిధులు ఆంధ్రకు చేరుకుంటున్నాయి. ఆయనపై ప్రజలు ఉంచుకున్న నమ్మకం మరొకసారి నిజం కాబోతోంది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అందరూ ఊహించినట్లుగానే మంగళవారం నాడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధానికి నిధులను సమకూర్చే విధంగా ప్రకటనలు జారీ చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు కేటాయించనున్నట్లు నిర్మల సీతారామన్ తెలియజేశారు.
జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలతో పాటు ఏపీకి సైతం కేంద్రం ప్రత్యేక నిధులు అందిస్తామన్న భరోసాని ఇచ్చారు. అంతేకాదు నిధులు లేక దశాబ్దాలుగా ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాలైన ప్రకాశం, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాక్ ను కూడా అందివ్వబోతున్నట్టు కేంద్రం తెలియపరిచింది. ముందు ముందు అవసరాలను బట్టి మరిన్ని నిధులను కూడా అందించి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి కేంద్రం తన వంతు సహాయాన్ని అందిస్తోంది. నిర్మల సీతారామన్ ప్రకటన అనంతరం ఏపీలో పండుగ వాతావరణం నెలకొంది.
తొలి బడ్జెట్ లో ఏపీకి కేంద్రం సహాయం అందివ్వడం.. నిధులు సమకూర్చడం తో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో ప్రతి బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరుగుతూ వచ్చింది. అయితే ఈసారి పరిస్థితుల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని.. దీనికి చంద్రబాబు కారణమని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి ఇది ఆరంభమని.. ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి నవ చంద్రోదయం అని అందరూ పొగుడుతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రాలో మరిన్ని అభివృద్ధి పనులు కేంద్రం చేపడుతుంది అనడానికి ఇది సూచనప్రాయమని అందరూ భావిస్తున్నారు.