Dhaka: భారత్ తో సంబంధాలు మాకు చాలా ముఖ్యం : బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ లో రాజకీయ కల్లోలం కార్చిచ్చులా మారుతోంది. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఉస్మాన్ హాదీ హత్యోదంతంతో బంగ్లాదేశ్.. నివురుగప్పిన నిప్పులా మారింది. దీన్ని భారత్ పై తోసి.. వ్యతిరేకత పెంచుదామని ప్రయత్నించిన యూనస్ సర్కార్ ప్రయత్నం బెడిసికొట్టింది. సాక్షాత్తూ హాదీ సోదరుడే .. ఉస్మాన్ హత్య వెనక బంగ్లా దేశ్ సర్కార్ లోని ఓవర్గం హస్తముందని ఆరోపించడంతో .. ఆందోళనలు యూటర్న్ తీసుకున్నాయి.
మరోవైపు భారత్ వ్యతిరేకత పెరిగిపోతుండడం.. అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా .. బంగ్లాలో పరిస్థితిపై ఆందోళన చేయడంతో .. ఆదేశంపై అంతర్జాతీయ ఒత్తిడి అధికమవుతోంది. దీంతో ఒత్తిడి నుంచి తప్పించుకునేందు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహహ్మద్ యూనస్ ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్ తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు యూనస్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను.. రాజకీయ వ్యాఖ్యల నుంచి వేరు చేసి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
‘‘భారత్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటాం. ఇందుకోసం యూనస్ కృషి చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారు. అయితే భారతీయ వర్గాలతో మాత్రం ఇప్పటివరకు నేరుగా ఆయన మాట్లాడలేదు. బంగ్లాదేశ్ వాణిజ్య విధానం రాజకీయ అంశాల ఆధారంగా ఉండదు. వియత్నాం లేదా ఇతర దేశాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం కంటే భారత్ నుంచి తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయడం ఆర్థికంగా సరైన నిర్ణయం. ఢిల్లీతో సత్సంబంధాలను మేం కోరుకుంటున్నాం. అందుకే భారత్ నుంచి 50 వేల టన్నుల బియ్యం కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించాం’’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమ సంబంధాలను దెబ్బతీసేందుకు బాహ్యశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
దీపూచంద్ర కుటుంబానికి అండగా ఉంటాం.. యూనస్
బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందూ యువకుడు దీపూచంద్ర దాస్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వంలో విద్యారంగ సలహాదారుగా ఉన్న సి.ఆర్.అబ్రార్.. మొహమ్మద్ యూనస్‌తో భేటీ అనంతరం మంగళవారం దీపూచంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన తల్లిదండ్రులు, భార్యాబిడ్డల సంక్షేమ బాధ్యతలను సర్కారు చూసుకుంటుందని హామీ ఇచ్చారు. దీపూచంద్ర హత్య క్రూరమైన నేరమని, అది ఎంతమాత్రమూ క్షమార్హం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అవామీ లీగ్‌పై నిషేధం పట్ల అమెరికా చట్టసభ్యుల ఆందోళన
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉండటంపై అమెరికాకు చెందిన పలువురు చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి కూడా అవకాశం కల్పించాలని యూనస్ సర్కారుకు ఓ లేఖలో తాజాగా సూచించారు. పారదర్శక రీతిలో, స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ ప్రజలకు ఉండాలని అభిప్రాయపడ్డారు.






