Pakistan: ఇప్పుడు పాకిస్తాన్ ముఖచిత్రం ఏంటంటే…?

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పాకిస్తాన్‌లో (Pakistan) ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంజాబ్ ప్రావిన్స్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. లాహోర్, సియాల్‌కోట్ వంటి ప్రధాన విమానాశ్రయాలు 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు తెలిపారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అన్ని పాఠశాలలు మూతపడ్డాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి పాకిస్తాన్ సైన్యం భారీ షెల్లింగ్‌కు పాల్పడింది. దీనికి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. ఈ ఘర్షణల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరులు భయాందోళనలో ఉన్నారు. అనేక గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
భారత సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై 24 ఖచ్చితమైన మిస్సైల్ దాడులు (Missile Attacks) చేసింది. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కర్-ఎ-తొయిబా (LeT), హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలున్నాయి. ఈ దాడుల్లో 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భారత వర్గాలు పేర్కొన్నాయి. వీళ్లలో JeM నాయకుడు మసూద్ అజహర్ కుటుంబంలోని 10 మంది, నలుగురు సన్నిహిత సహాయకులు కూడా ఉన్నారు. బహవల్పూర్‌లోని JeM ప్రధాన కార్యాలయం, మురిడ్కేలోని LeT స్థావరం ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమయ్యాయి.
భారత దాడుల్లో 26 మంది పౌరులు మరణించారని, 46 మంది గాయపడ్డారని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పేర్కొన్నారు. బహవల్పూర్‌లో ఒక మసీదుపై జరిగిన దాడిలో ఒక బాలుడు మరణించాడని, ఇద్దరు పౌరులు గాయపడ్డారని తెలిపారు. ముజఫరాబాద్‌లోని ఒక చిన్న మసీదు కూడా దెబ్బతింది. ఒక మీనార్ కూలిపోయింది. అయితే భారత ప్రభుత్వం ఈ దాడులను కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే జరిపినట్లు ప్రకటించింది. పౌర లేదా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థానికులు గందరగోళంలో ఉన్నారు. కొందరు స్థానికులు ఇవి ఉగ్రవాద స్థావరాలేనని, వీటి వల్లే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. వీటిని పాకిస్తాన్ సైన్యం, ISI సమర్థిస్తున్నాయని విమర్శిస్తున్నారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ దాడులను యుద్ధ చర్యగా అభివర్ణించారు. దీనికి కచ్చితంగా బదులిస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ దాడులు ఉగ్రవాద స్థావరాలపై కాకుండా పౌర ప్రాంతాలపై జరిగాయని ఆరోపించారు. పాకిస్తాన్ సైన్యం భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఒక డ్రోన్‌ను కూల్చివేసినట్లు పేర్కొంది. అయితే భారత్ ఈ వాదనలను తిరస్కరించింది. పాకిస్తాన్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించి, భారత్ చర్యలను ఖండించింది. అమెరికా, చైనా, రష్యాతో పాటు ఐక్యరాష్ట్ర సమితి రెండు దేశాలను సంయమనం పాటించాలని కోరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘర్షణను అవమానకరం అని పేర్కొన్నారు. ఇది త్వరగా ముగియాలని ఆకాంక్షించారు.