Kadapa Steel Plant : ఈసారైనా కడప స్టీల్ ప్లాంట్ పట్టాలెక్కేనా..?

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ (Kadapa Steel Plant) స్థాపన దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయింది. రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి ఈ ప్రాజెక్టు కీలకమని భావించినప్పటికీ ఇది ఇప్పటివరకూ సాకారం కాలేదు. ఇప్పటివరకు నాలుగు సార్లు శంకుస్థాపనలు జరిగినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. తాజాగా కడప మహానాడులో (Mahanadu) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu).. మరో 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. జూన్ రెండో వారంలో శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. దీంతో కడప స్టీల్ ప్లాంట్ పై మళ్లీ ఆశలు చిగురించాయి.
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలనే ఆలోచన 1990ల నుంచే ఉంది. ఈ ప్రాంతంలో బెరైటీస్, సున్నపురాయి, యురేనియం వంటి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉండటం, స్టీల్ ప్లాంట్ స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించింది. ఈ ప్రాజెక్టు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, రాయలసీమ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని భావించారు. గతంలో బ్రాహ్మణి స్టీల్స్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ముదుంకొచ్చింది. కానీ కుదరలేదు. ఇప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (JSW) ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు అంగీకరించింది. ఈ మేరకు 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో JSW అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
కడప స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటివరకు నాలుగు సార్లు శంకుస్థాపనలు జరిగాయి. 2001లో మొదటి శంకుస్థాపన టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2010లో రెండో శంకుస్థాపన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. మూడోసారి 2019లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. నాలుగోసారి 2022లో జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. కానీ పూర్తి కాలేదు.
కడప స్టీల్ ప్లాంట్ పూర్తి కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. రాజకీయ అస్థిరత ఇందుకు మొదటి కారణం. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వాలు మారడం, ప్రాజెక్టుపై స్థిరమైన విధానం లేకపోవడం సమస్యగా మారింది. ప్రతి ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ, తదనంతర చర్యలు తీసుకోలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు అవసరం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం, పెట్టుబడుల కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి. భూసేకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కరెంటు, నీటి సరఫరా వంటి సాంకేతిక సమస్యలు కూడా ప్రాజెక్టును ఆలస్యం చేశాయి. JSW వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, ఆర్థిక, సాంకేతిక సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టలేకపోయాయి.
తాజాగా కడపలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు మళ్లీ స్టీల్ ప్లాంట్ పై ప్రకటన చేశారు. దాదాపు 8వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 3వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి ఊతమిస్తుందని ఆయన వెల్లడించారు. కడప స్టీల్ ప్లాంట్ సాకారమైతే రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక వరం కాగలదు. కానీ గత దశాబ్దాల అనుభవాలు రాజకీయ సంకల్పం, నిధుల కేటాయింపు, సమన్వయం లోపించడం వల్ల ఆలస్యమైందని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన తాజా గడువులు, పెట్టుబడులు నిజమైతే, ఈ ప్రాజెక్టు కడప జిల్లా ఆర్థిక చిత్రపటాన్ని మార్చగలదు.