Arakan Army: అరాకాన్ ఆర్మీకి అమెరికా అండదండలున్నాయా..? ఇందులో బంగ్లాదేశ్ పాత్ర ఏమిటి..?

బంగ్లా-మయన్మార్ మధ్య అగ్రరాజ్యం కొత్త చిచ్చు రగల్చనుందా? రాఖైన్ ప్రాంతంలో తలదాచుకుంటున్న రోహింగ్యాలకు మానవతా సాయం అందించే మిషతో అమెరికా బంగ్లాలో అడుగుమోపనుందా..?. తాజాగా ఒకదాని వెంట మరొకటిగా జరుగుతున్న పరిణామాలు .. దీన్నే సూచిస్తున్నాయి.
ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ (Bangladesh) ను సందర్శించిన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అక్కడి కాక్స్ బజార్‌లోని రోహింగ్యా శరణార్థి శిబిరాలను సందర్శించారు. మయన్మార్‌లోని రాఖైన్ స్టేట్ నుంచి తరిమేయడంతో వీరంతా బంగ్లాకు తరలివచ్చారు. శరణార్థుల దుస్థితిపై ఈ ఏడాది సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ చర్చించనుంది. ఆ లోగా రోహింగ్యాల కోసం బంగ్లా నుంచి రాఖైన్ స్టేట్ వరకు మానవతా సహాయ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని గుటెరెస్ ప్రతిపాదించారు. ఆ వంకతోనే అమెరికా వైమానిక, సైనిక దళాధికారులు బంగ్లా వచ్చి కారిడార్ కోసం సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ కారిడార్ గురించి యూనస్ సర్కారు ప్రజలతోగానీ, రాజకీయ పార్టీలతోగానీ ముందుగా సంప్రదించకపోవడాన్ని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రహమాన్ బహిరంగంగా తప్పుపట్టారు. బంగ్లా స్వాతంత్య్రం, సార్వభౌమత్వాలను యూనస్ సర్కారు పణంగా పెడుతోందని విమర్శించారు. ‘‘బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని నేను కనుక అమెరికాకు అప్పగించి ఉంటే… ఇప్పటికీ అధికారంలో కొనసాగుతూ ఉండేదాన్ని’’ అంటూ పదవీచ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్ హసీనా చెప్పడాన్ని ఇక్కడ గమనించాలి.
మయన్మార్‌లోని రాఖైన్ స్టేట్‌ను ఆనుకుని ఉండే కాక్స్ బజార్ ప్రాంతానికి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే సెయింట్ మార్టిన్ ద్వీపం ఉంది. అక్కడ సైనిక, నౌకా స్థావరాన్ని ఏర్పాటుచేస్తే మలక్కా జలసంధి గుండా చైనా నౌకలపై నిఘా వేసి, యుద్ధ సమయాల్లో వాటి రాకపోకలను అడ్డుకోవచ్చన్నది అమెరికా వ్యూహం. ఇది చైనాకూ, దాని మద్దతుతో మయన్మార్‌లో అధికారంలో కొనసాగుతున్న సైనిక ప్రభుత్వానికీ బొత్తిగా గిట్టని వ్యవహారం.
భారత్, చైనాలకు కీలకం…
మయన్మార్ సైనిక ప్రభుత్వంపై పోరాడుతున్న ‘అరకాన్ ఆర్మీ’ (Arakan Army) రాఖైన్ స్టేట్‌లోని మొత్తం 17 పట్టణాల్లో 13 చోట్ల ఆధిపత్యం సాధించింది. యావత్ గ్రామీణ ప్రాంతం ఇప్పుడు దాని ఆధీనంలోనే ఉంది. బంగ్లాదేశ్ వెంబడి 271 కిలోమీటర్ల సరిహద్దు భూభాగమూ అరకాన్ ఆర్మీ చేతుల్లోకే వెళ్లిపోయింది. రాఖైన్ స్టేట్ రాజధాని సిట్వేతో పాటు క్యౌక్‌ప్యూ మాత్రమే ఇప్పుడు మయన్మార్ సైనిక ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఈ రెండు రేవు పట్టణాలూ భారత్, చైనాలకు చాలా కీలకమైనవి. సిట్వే రేవు నుంచి మణిపుర్ వరకు కాలడాన్ బహువిధ రవాణా ప్రాజెక్టును ఢిల్లీ చేపట్టింది. డ్రాగన్ క్యౌక్‌ప్యూ రేవు నుంచి యునాన్ రాష్ట్రం వరకు చైనా-మయన్మార్ ఆర్థిక నడవా(సిమెక్) ప్రాజెక్టు నిర్మిస్తోంది. క్యౌక్‌ప్యూ ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ఏర్పరచి అక్కడ డీప్‌సీ రేవునూ, ఆయిల్, గ్యాస్ పైపులైన్లనూ నిర్మిస్తోంది. తమ ప్రాజెక్టులు సజావుగా సాగడం కోసం భారత్, చైనాలు మయన్మార్ సైనిక ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపుతున్నాయి. అది రాఖైన్ స్టేట్‌లోని అరకాన్ ఆర్మీకి కంటగింపుగా మారింది. దీన్ని అమెరికా వాటంగా తీసుకుంటోంది. ఈ పరిణామం భారత్, చైనాలకు తలనొప్పులు తెచ్చిపెట్టవచ్చు.
ఆయువుపట్టు మీద దెబ్బ
చైనాకు సిమెక్ కారిడార్ చాలా కీలకమైనది. డ్రాగన్ చమురు దిగుమతుల్లో 80శాతం మలయా ద్వీపకల్పం, ఇండోనేసియాల మధ్యనున్న ఇరుకైన మలక్కా జలసంధి గుండానే జరుగుతున్నాయి. దీన్ని ఎవరైనా అడ్డుకున్నా, ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవడానికే చైనా క్యౌక్‌ప్యూ రేవు నుంచి తమ యునాన్ రాష్ట్రం వరకు చమురు, గ్యాస్ పైపులైన్లను నిర్మిస్తోంది. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రాలను కలిపే మలక్కా జలసంధిని అమెరికా దిగ్బంధించినా యునాన్-క్యౌక్‌ప్యూ సిమెక్ కారిడార్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పరచుకోవచ్చని డ్రాగన్ భావిస్తోంది. చైనా నుంచి పాక్ బలూచిస్థాన్‌లోని గ్వాడర్ వరకు సాగే చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా(సిపెక్) అది. చైనా నౌకలు పర్షియన్ సింధు శాఖ ద్వారా పయనిస్తూ ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తాయి. ఆ సింధుశాఖ మార్గాన్ని కాపాడుకోవడానికి సిపెక్‌లో భాగంగా గ్వాడర్ రేవు నిర్మిస్తున్నారు.
సిమెక్, సిపెక్‌లను దిగ్బంధించడమంటే చైనా ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టడమే అవుతుంది. ఇప్పటికే బలూచిస్థాన్‌లో సిపెక్ ప్రాజెక్టులపై దాడులు జరుగుతున్నాయి. రేపు అరకాన్ ఆర్మీ సిమెక్ మీద దాడి చేయదనే భరోసా ఏమీ లేదు. ఇదంతా చూస్తుంటే ఐక్యరాజ్యసమితి సూచనపై బంగ్లా నుంచి ఏర్పాటుచేసే మానవతా సహాయ కారిడార్ గుండా అరకాన్ ఆర్మీకి ఆయుధ, ఆర్థిక సాయం అందించి సిమెక్‌ను దెబ్బకొట్టాలన్నదే అమెరికా వ్యూహం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అదే నిజమైతే, ఈ కారిడార్ పరిస్థితి కూడా గాజా, అఫ్గానిస్థాన్‌ల మాదిరిగా తయారవుతుంది. దీన్ని నిరోధించడానికి చైనీస్ యునాన్ రాష్ట్ర గవర్నర్ బంగ్లాదేశ్ వచ్చి మంతనాలు జరిపారు. భారత్ కూడా అరకాన్ ఆర్మీని దగ్గర చేసుకోవాలని యోచిస్తోంది.