Greenland: గ్రీన్ లాండ్ కావాలంటున్న ట్రంప్.. వద్దంటున్న అమెరికన్లు…!
అమెరికా ఫస్ట్ నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. తన విధానంలో చాలా దూరం ముందుకెళ్లారు. వెళ్తున్నారు కూడా. అమెరికాకు భారీగా చమురు దక్కాలని.. చమురురంగంపై వైట్ హౌస్ పెత్తనం ఉండాలని పదేపదే కోరుకున్న ట్రంప్.. అనుకున్నట్లుగానే వెనెజువెలాను చేజిక్కించుకున్నారు. అంతేనా.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు కూడా. తర్వాత గ్రీన్ లాండ్ పై పడ్డారు.
జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్ లాండ్ తమకే దక్కాలంటున్నారు దేశాధ్యక్షుడు ట్రంప్.అందుకు నాటో దేశాలు చొరవ చూపాలని, లేదంటే రష్యా, చైనా ఆ దీవిని వశపరుచుకుంటాయని చెబుతున్నారు కూడా. అయితే దీన్ని నాటో దేశాలు సైతం నమ్మడం లేదు. అంతెందుకు డెన్మార్క్ అధీనంలోని గ్రీన్లాండ్ను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని 75 శాతం మంది అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు. కేవలం 25 శాతం మంది మాత్రమే ట్రంప్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు ఓ సర్వే పేర్కొంది.
గ్రీన్లాండ్ను అమెరికా వశపరుచుకోవాలన్న ఆలోచనను మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఎస్ఎస్ఆర్ఎస్ సర్వే పేర్కొంది. ట్రంప్ సొంత పార్టీలోనూ దీనిపట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపింది. రిపబ్లికన్లు, రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండే స్వతంత్రుల్లో 50 శాతం మంది ట్రంప్ చర్యను సమర్థిస్తుండగా.. అదే స్థాయిలో వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఇక డెమోక్రాట్లు, ఆ పార్టీ అనుకూల స్వతంత్రుల్లో 94 శాతం మంది గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. పూర్తి స్వతంత్రులుగా ఉన్న వారిలో 80 శాతం మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు సర్వే పేర్కొంది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న ట్రంప్.. తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. అలాగే, గ్రీన్లాండ్పై దృష్టి సారించిన ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ తాను వెనక్కి తగ్గేదే లే అంటూ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు అణచివేయాలని చూస్తే అమెరికా రంగంలోకి దిగాల్సి ఉంటుందని ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నారు. ఇలా అమెరికా తన మిలటరీ చర్యల ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ట్రంప్ ఇప్పటికే చాలా దూరం వెళ్లారని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడగా.. ట్రంప్ విదేశాంగ విధానం వల్ల అంతర్జాతీయ సమాజంలో దేశ పరపతి దెబ్బతింటోందని 57 శాతం మంది ఆందోళన వ్యక్తంచేశారని సర్వే తెలిపింది.






