China: కొత్త బంగారు చైనా… ప్రపంచమా ఉలిక్కిపడు…?
ప్రపంచాన్ని శాసించాలంటే.. ఖనిజ ఉత్పత్తిపై పట్టు సాధించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లోహాలు, పారిశ్రామిక అవసరాలు పెరుగుతుండడం తో … వాటికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూ పోతోంది.ఈ క్రమంలో చైనా ఖనిజ ఉత్పత్తి..సరఫరాలో అంతర్జాతీయంగా గట్టి పట్టు సాధించేందుకు ఏళ్ల తరబడిగా ప్రయత్నిస్తోంది. ప్రపంచ బంగారం మార్కెట్ లో చైనా అగ్రస్థానంలో ఉన్నప్పటికి..దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలతో పోల్చితే బంగారు గనుల గుర్తింపు..ఉత్పత్తిలో వెనుకబడి ఉంది. ప్రస్తుతం ప్రపంచ బంగారు ఉత్పత్తిలో చైనా 10 శాతం మేరకు వాటాను కలిగి ఉంది. గత సంవత్సరం చైనా 377 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసిందని చైనా గోల్డ్ అసోసియేషన్ వెల్లడించింది.
కొన్ని నెలల క్రితం లియోనింగ్ ప్రావిన్స్‌లో 1,444 టన్నులకు పైగా సూపర్గోల్డ్ నిక్షేపాలను కనుగొన్నట్లు చైనా ప్రకటించింది. నవంబర్ నెలలో జిన్జియాంగ్ సమీపంలోని కున్లున్ పర్వత ప్రాంతంలో 1,000 టన్నులకు పైగా బంగారు నిల్వలను కూడా గుర్తించారు. గత ఏడాది కాలంలో చైనా ప్రకటించిన 1,000 టన్నుల పరిమితిని మించిన మూడో అతిపెద్ద బంగారు నిల్వగా ఇదే. అంతకుముందు హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్ కౌంటీలో దాదాపు 1,000 మెట్రిక్ టన్నుల అధిక నాణ్యత కలిగిన బంగారు నిక్షేపాలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని విలువ మన కరెన్సీలో దాదాపు రూ. 7 లక్షల కోట్లుకి పైగానే ఉంటుంది. చైనా బంగారు గనులు అన్వేషణలో షాన్డాంగ్ ప్రావిన్స్ కీలకంగా ఉంది. జియాడోంగ్ ద్వీపంలో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద బంగారు గనుల బెల్ట్లలో ఇదొకటిగా నిలిచింది.
అధునిక సాంకేతికతతో కొత్త గనుల గుర్తింపు
ప్రపంచంలోని మరే దేశానికి లేని డీప్-ఎర్త్ టెక్నాలజీ సామర్థ్యంతో చైనా ఖనిజాన్వేషణలో కొత్త గనులను గుర్తించడంలో విజయం సాధిస్తోంది. ఖనిజాలను అన్వేషించడానికి ఏఐ టెక్నాలజీ, భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ సాంకేతికత, ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానంతో ఇటీవల “జిన్షియుయిట్” అనే కొత్త ఖనిజాన్ని సైతం కనుగొంది. దీనిని అంతర్జాతీయ ఖనిజ సంఘం గుర్తించింది. ఈ కొత్త ఖనిజం బ్యాటరీ, రసాయన, అంతరిక్ష రంగాలకు ముఖ్యమైన లోహాలతో సంబంధం కలిగి ఉండటం విశేషం.
సముద్రం అడుగున బంగారు గుట్టలు
చైనా మొదటిసారిగా సముద్రం అడుగున బంగారు నిక్షేపాలను కనుగొంది. సుమారు 3900 టన్నులకుపైగా బంగారం నిల్వలు ఉన్నట్లు చైనా గుర్తించింది. ఇది చైనా మొత్తం బంగారు నిల్వలలో 26 శాతం. ఆసియాలో ఇప్పటివరకు ఉన్నవాటిలో అతిపెద్ద బంగారు గని గా కూడా ఈ కొత్త బంగారు నిధులు గుర్తింపు పొందాయి. మైన్యూస్ నివేదిక ప్రకారం.. ఈ బంగారు నిక్షేపాలు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని యాంటై నగరానికి సమీపంలో ఉన్నాయి. లైజౌ తీరం కింద ఈ బంగారు నిక్షేపాలను కనుగొన్నారు. ఇక్కడి నుంచి బంగారాన్ని వెలికితీయగలిగితే ఇది లైజౌను చైనాలో అతిపెద్ద బంగారు నిల్వ, బంగారు ఉత్పత్తి ప్రాంతంగా మార్చనుందంటున్నారు. కొత్తగా కనిపెట్టిన బంగారు గనుల నుంచి చైనా తవ్వకాలు ప్రారంభిస్తే.. బంగారం ధరలను డిసైడ్ చేసే శక్తిగా డ్రాగన్ కంట్రీ అవతరించవచ్చంటున్నారు నిపుణులు.






