VISA RULES EFFECT: వీసా రూల్స్ ఎఫెక్ట్.. ప్రయాణాలంటేనే వణికిపోతున్న వలసదారులు….!
Immigrants in US:
క్రిస్మస్ సందడి లేదు.. న్యూఇయర్ వేడుకలు లేవు.. అసలు పర్యటనల ఊసేలేదు. ఉన్నదేదో తిందాం.. ఇంటిలోనే ఉందాం. కాదని బయటకు వెళ్లారో.. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ కన్నేసే ప్రమాదం పొంచి ఉంది. ఇది అమెరికాలోని వలసదారుల పరిస్థితి. దీంతో గతానికి భిన్నంగా ఈసారి వలసదారులు.. ఇళ్లకే పరిమితమవుతున్నారు. అన్నీ అనుకూలించినప్పుడు చూద్దాం.. ప్రస్తుతానికి ఇంటికే పరిమితమవుదామని నిశ్చయానికి వచ్చేశారు. అదిప్పుడు కనిపిస్తోంది కూడా.
సాదారణంగా.. అమెరికాలో ఇప్పుడు క్రిస్మస్, న్యూఇయర్ హాలీడే సీజన్ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటుంది. వరుస సెలవులతో అనేక మంది పర్యటనలకు మొగ్గు చూపుతుంటారు. అయితే, ట్రంప్ వీసా రూల్స్ పుణ్యమా అని వలసదారులు (Immigrants in US) మాత్రం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కఠిన ఇమిగ్రేషన్ నిబంధనల నేపథ్యంలో ప్రయాణాలంటేనే ‘వద్దు బాబోయ్’ అంటూ భయపడుతున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు సహా అనేకమంది వలసదారులు తమ ప్రయాణాలను మానుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్, కేఎఫ్ఎఫ్ సర్వేలో వెల్లడైంది.
ఇమిగ్రేషన్ (US Immigration) అధికారుల దృష్టిలో పడకూడదనే ఉద్దేశపూర్వకంగా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నామని ప్రతి 10 మందిలో ముగ్గురు విదేశీ వలసదారులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది. హెచ్-1బీ వీసాదారుల్లో 32శాతం మంది, అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో 15శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సర్వే తెలిపింది. ఇక, సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో అయితే ఏకంగా 63శాతం మంది బయటకు ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటున్నారట..!
విదేశీ ప్రయాణాలు మాత్రమే కాదు.. అమెరికాలోనూ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసదారులు ఇష్టపడటం లేదని సర్వే తెలిపింది. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో… అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఇటీవల పలు టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు సూచించాయి.






