Trump: ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ అవార్డ్..
నోబెల్ పీస్ ప్రైజ్ అయితే రాలేదు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు.. వివిధ దేశాలు తమ అంతర్జాతీయ పీస్ ప్రైజ్ అవార్డులను ప్రకటించి సత్కరిస్తున్నాయి. ఇటీవలే ఫిఫా పీస్ ప్రైజ్ ను ట్రంప్ కు ప్రకటించగా.. ఇప్పుుడు ఇజ్రాయెల్ సైతం ఆసంస్థ బాటలో నడిచింది. ట్రంప్ నకు.. ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ అవార్డు ప్రకటించింది.
ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ట్రంప్- బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
గత 80 ఏళ్ల చరిత్రలో ఈ పురస్కారాన్ని ఓ విదేశీయుడికి (నాన్-ఇజ్రాయెల్ సిటిజన్) ఇవ్వడం ఇదే తొలిసారి కాగా.. శాంతి విభాగంలో అవార్డును ప్రకటించడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఏడాది జులై లో ఇజ్రాయెల్ తమ నిబంధనలను సవరించి మరీ విదేశీయులకు ఈ అవార్డు ఇచ్చేలా మార్పులు చేసింది. ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై ట్రంప్ ఈ అవార్డును స్వీకరించే అవకాశం ఉంది.
“ట్రంప్ ఎన్నో సంప్రదాయాలను తిరగరాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకే మేం కూడా సంప్రదాయాన్ని పక్కనపెట్టి తొలిసారి ఓ ఇజ్రాయేలేతరుడికి ఈ అవార్డును ఇస్తున్నాం. యూదు ప్రజలకు, ఇజ్రాయెల్ భద్రతకు ట్రంప్ చేసిన సేవలకు ఇది గుర్తింపు” అని నెతన్యాహు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్.. ఈ గౌరవం తనను ఆశ్చర్యపరిచిందని, ఇజ్రాయెల్ గుర్తింపు పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
భేటీలో భాగంగా గాజా శాంతి ఒప్పందం రెండో దశ, వెస్ట్ బ్యాంక్ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. వెస్ట్ బ్యాంక్ విషయంలో తమ మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ ఒప్పందానికి కట్టుబడి ఉందని, ఆ దేశం బలంగా ఉందని ట్రంప్ కితాబునిచ్చారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని నెతన్యాహు వెల్లడించారు.






