Delhi: సుదర్శన చక్ర ఛత్ర ఛాయల్లో ఢిల్లీ.. కేంద్రం కీలక నిర్ణయం..!
దేశ రాజధాని ఢిల్లీ భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయంతీసుకుంది. పార్లమెంటు, ఇతర భద్రతా సంస్థలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ ఉన్నతాధికారులు ఉండే రాజధానిని రక్షణకు సుదర్శన చక్ర ఉపయోగించాలని డిసైడైంది. కీలక వీఐపీ-89 జోన్లో గగనతల భద్రత కోసం..దేశీయ సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ (IADWS) కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘సుదర్శన చక్ర (Sudarshan Chakra For Delhi)’ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది..
సుదర్శన చక్ర గగనతల రక్షణ వ్యవస్థ విలువ దాదాపు రూ.5,181 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని డీఆర్డీవో (DRDO) అభివృద్ధి చేసింది. ఇది దేశ రాజధాని చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి గగనతల ముప్పునైనా అడ్డుకోగలదని సదరు వర్గాలు వెల్లడించాయి. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల వంటి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ పోరాట సామర్థ్యాలను మరింత పెంచేలా రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ సామగ్రి కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
‘సుదర్శన్ చక్ర (Sudarshan Chakra)’ పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలోని వ్యూహాత్మక, పౌర, జాతీయ ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాలను రక్షించడం దీని లక్ష్యం. ఇందులో భాగంగా శత్రు క్షిపణులు, యుద్ధవిమానాలను గుర్తించి, వాటిని నేలకూల్చే వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. సైబర్ యుద్ధాన్ని తిప్పికొట్టే సామర్థ్యాన్ని కూడా ఈ వ్యవస్థలో అనుసంధానించనున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ప్రైవేటు సంస్థలు, సైన్యం మధ్య భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.






