అంబానీ ఇంట పెళ్లిలో అరెస్ట్ అయిన ఆంధ్ర యువకులు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న టాపిక్ ఒకటే ..అంబానీ ఇంట జరిగిన పెళ్లి. పొలిటిషన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు.. ఈ పెళ్లికి హాజరు కాని వారు లేరు. పెళ్లికి వెళ్లడానికి ఇన్విటేషన్ రావడమే గొప్ప స్టేటస్ సింబల్‌గా అందరూ భావిస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో ముంబైలో ఘనంగా జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి వేడుకల మధ్యలో ఓ చిన్న సంఘటన చోటు చేసుకుంది. ఇది మన ఆంధ్రాకి సంబంధించిన సంఘటన కావడం గమనార్హం.
అంబానీ , ప్రపంచ వివాహ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా తన చిన్న కొడుకు పెళ్లి ఎంతో వైభవంగా నిర్వహించారు. నిపుణుల అంచనా ప్రకారం 100 ఏళ్లలో ఇటువంటి పెళ్లి జరగలేదు.. మరొక 100 ఏళ్లలో ఇలాంటి పెళ్లి జరుగుతుంది అన్న గ్యారెంటీ కూడా లేదు. ఆ విషయం కాస్త పక్కన పెడితే పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్లి ఇద్దరు యువకులు ముంబై పోలీసులు చేతికి చిక్కారు. ఈ ఇద్దరు ఆంధ్రకి సంబంధించిన యువకులు. ఇందులో ఒకరు యూట్యూబర్ వెంకటేష్ అల్లూరి అని.. మరొకరు వ్యాపారవేత్త అని చెప్పుకుంటున్న షపీ షేక్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు.
ప్రస్తుతానికి విడుదల చేశాము కానీ ఇద్దరిపై చట్టపర్యమైన చర్యలు మాత్రం ఉంటాయని స్పష్టం చేశారు. అంబానీ ఇంట పెళ్లి అంటే ప్రపంచంలో ఉన్న కుబేరులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.. ఇలా ఎందరో హాజరవుతారు. వాళ్లని చూడాలి అనుకున్నారో.. లేక అంబానీ ఇంట పెళ్లి సందడిలో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనుకున్నారో.. మొత్తానికి ఈ ఇద్దరు ఇన్విటేషన్ లేకుండానే పెళ్లికి వెళ్లే సాహసం చేశారు.
ప్రముఖులు వచ్చే పెళ్లి కాబట్టి హై సెక్యూరిటీ ఉండడం సహజమే. పోలీసు నిఘాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ఇద్దరిపై సందేహం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు ఇన్విటేషన్ లేకుండా పెళ్లికి వచ్చారు అన్న విషయం బయటపడింది. ఇంత దానికి అరెస్టు చేయాలా అనుకుంటున్నారా.. ఇంతకుముందు అయితే ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే రీసెంట్ గా ఇలా ఇన్విటేషన్ లేకుండా వేడుకలకు హాజరైతే అరెస్టు చేసి విచారించాలి అని కొత్తగా చట్టం వచ్చింది. అందుకే పోలీసులు ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఇద్దరిపై త్వరలో విచారణ కూడా జరుగుతుంది.