ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వినుకొండ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

వినుకొండ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

రాష్ట్రంలో ఇవాళ సాక్షాత్తూ సీఈసీ ఆదేశాలూ బేఖాతరు చేస్తున్నారని, వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారని, ఇదీ మన దేశ అత్యున్నత వ్యవస్థ పరిస్థితి అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజల పాలన ఉందా? లేక చంద్రబాబు పెట్టుకున్న పోలీసు పాలన ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తనకు కావాల్సిన అధికారులతో తనకు కావాల్సిన విధంగా ఆదేశాలు జారీ  చేయిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌ను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే  చంద్రబాబు తన మనుషులతో దాన్ని అమలు చేయనీయకుండా పక్కన పెట్టించాడని చెప్పారు. ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు ఈ పని  చేయగలిగాడూ అంటే, ఆయన మళ్లీ సీఎం అయితే ఎవర్నైనా బతకనిస్తాడా? అని జననేత సూటిగా ప్రశ్నించారు. 

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. భగ్గున మండుతున్న ఎండను ఏ మాత్రం పట్టించుకోని ప్రజలు జననేత సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పట్టణం జనసంద్రంగా మారింది.

నీటికి కట కట

వినుకొండ నియోజకవర్గం పక్కనే సాగర్‌ ప్రాజెక్టు ఉన్నా తాగేందుకు నీరు లేదని, మరోవైపు సాగు నీరు కూడా లేదని, 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఇంత దారుణంగా నీట కొరత ఉందని, ఆ స్థాయిలో పాలకులు నిర్లక్ష్యం చేశారని శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని చెబుతున్న పాలకులు, సమస్యను మాత్రం అలాగే వదిలేశారని చెప్పారు. 

ఇదే మున్సిపాలిటీలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తూ, ఒకవైపు డబ్బులు డ్రా చేస్తూ, మరోవైపు క్యాన్‌కు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారని తెలిపారు.

బొల్లాపల్లి మండలంలో తాగు నీరు లేక బంధువులను కూడా రావద్దనే పరిస్థితి నెలకొందని, ఇదే మండలంలోని భమిడిపాడులో ట్యాంకర్‌ వద్ద గొడవ జరిగి ఒకరు చనిపోయారని చెప్పారు.

నియోజకవర్గంలో తాగు, సాగు నీటి కోసం అంటూ 1996లో  వరికపురసల ప్రాజెక్టుకు టెంకాయ కొట్టిన చంద్రబాబు ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికలు రావడంతో మళ్లీ టెంకాయ కొట్టి, 24 వేల ఎకరాలకు నీరిస్తామంటున్నాడని తెలిపారు. 

పట్టిసీమ నుంచి నీరు తెచ్చి పులివెందుల వరకు ఇస్తున్నామని ఒక పక్క గొప్పలు చెబుతున్న ప్రభుత్వం, ఇక్కడ నూజెండ్ల మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద 20 ఎత్తిపోతల పథకాలకు నీరు లేకపోయినా, 50 గ్రామాలలో మంచినీరు కూడా దొరక్కపోయినా పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. 

అంతులేని అవినీతి

నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయిలో ఉందని, నీరు–చెట్టు పేరుతో దోచుకుంటున్నారని, గుండ్లకమ్మ నదిపై డ్యామ్‌ కట్టమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.

పంటలు–గిట్టుబాటు ధరలు

నియోజకవర్గంలో ప్రధానమైన పంటలు మిర్చి, కంది, మినుము, పత్తి, వరి పరిస్థితి దారుణంగా ఉందని, మిర్చి పంటకు జెమిని వైరస్‌ సోకడంతో దిగుబడి  5నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయినా ప్రభుత్వం సహాయం చేయలేదని రైతులు చెబుతున్నారని తెలిపారు. 

మినుము కనీస మద్దతు ధర రూ.5600 కాగా రూ.4700 కూడా రావడం లేదని, పత్తి కనీస మద్దతు ధర రూ.5500 అయితే రూ.4800 కూడా గిట్టుబాటు కావడం లేదని వివరించారు.

ఆలోచించండి

వీటన్నింటి గురించి ఆలోచించాలన్న ఆయన, చంద్రబాబు పాలనలో మనకు ఏం మేలు జరిగింది? అన్నది ప్రతి ఒక్కరూ యోచించాలని కోరారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవస్థలు అమ్ముడుపోయాయని, ఒక వైపు పాలన లేకపోగా, 5 ఏళ్లుగా ఆయన ప్రజలను మోసం చేశారని, అబద్ధాలు చెప్పారని, దుర్మార్గాలు చేశారని ఆరోపించారు.

ఎవర్నైనా బతకనిస్తాడా?

‘నిన్ననే మీరంతా చూశారు. ఇక్కడ ప్రజల పాలన ఉందా? లేక చంద్రబాబు పెట్టుకున్న పోలీసు పాలన ఉందా? ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తనకు కావాల్సిన అధికారులతో తనకు కావాల్సిన విధంగా ఆదేశాలు జారీ చేయిస్తున్నాడు. ఇంటలిజెన్స్‌ చీఫ్‌ను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినా, చంద్రబాబు తన మనుషులతో దాన్ని అమలు చేయనీయకుండా పక్కన పెట్టించాడు. ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ పని చేయగలిగాడూ అంటే, మళ్లీ సీఎం అయితే ఎవర్నైనా బతకనిస్తాడా?’ అని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.

చెలరేగుతున్నారు

ప్రజల్లో తనను చంపించే ప్రయత్నం చేశారని, విశాఖ విమానాశ్రయంలో తన మీద హత్యా ప్రయత్నం జరిగితే, ఆ తర్వాత గంటలోపే డీజీపీ ఏం మాట్లాడారో అందరూ విన్నారని, చంద్రబాబు స్క్రిప్ట్‌ ఇస్తే దాన్ని డీజీపీ చదివారని, బాబు కోసమే ఇంటలిజెన్స్‌ అధికారులు ఇవాళ రాష్ట్రంలో చెలరేగిపోతున్నారని జననేత అన్నారు.

అమ్ముడుపోయారు

చంద్రబాబు కోసం సాక్షాత్తూ సీఈసీ ఎన్నికల ఆదేశాలు కూడా పక్కన పెట్టే వ్యవస్థ కనిపిస్తోందన్న శ్రీ వైయస్‌ జగన్, రాష్ట్రంలో అత్యున్నత వ్యవస్థ పరిస్థితి ఇది అని చెప్పారు. ఇక బాబు కోసం ఎంతకైనా దిగజారే స్పీకర్‌ ఉన్నారని, ఆయన పని తీరు అందరూ చూశారని అన్నారు.

ఇంకా బాబు కోసం బాకా ఊదే ఎల్లో మీడియా ఉందన్న జననేత,.. ‘ఇవన్నీ మీరు చూస్తున్నారు. వీరంతా చంద్రబాబు నాయుడును మోస్తున్నారు? ఆయనకు ఏ విధంగా అమ్ముడుపోయారన్నది మీరంతా చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ఏం రక్షణ ఉంటుంది?

తాను ఒకటే అడుగుతున్నానని.. ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది? అని ప్రశ్నించారు. తన (ప్రతిపక్ష నేత) సొంత చిన్నాన్ననే హత్య చేయించి, నేరాన్ని తమ కుటుంబ సభ్యులపైనే నెట్టేందుకు పోలీసులు, అధికారులు, ఎల్లో మీడియాను వాడుతున్న ఈ వ్యవస్థలో ఏ ఒక్కరిౖకైనా రక్షణ ఉంటుందా? అని నిలదీశారు.

చంద్రబాబు కుట్రలు

‘చంద్రబాబు కుట్రలు చూడండి. అధికార పార్టీకి, చంద్రబాబుకు మేలు చేసేలా.. విలువలు లేని ఒక యాక్టర్, పార్టనర్‌తో చంద్రబాబు ఒక పార్టీ పెట్టిస్తాడు. ఆ యాక్టర్, పార్టనర్‌ ఎవరో మీ అందరికీ తెలుసు’.

‘కుట్రలో భాగంగా మరో పార్టీ పెట్టిస్తాడు. ఆ పార్టీ గుర్తు, కండువాతో పాటు, ఆ పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను పోలి ఉన్నాయి. ఆ పార్టీ ఎవరిదో మీ అందరికీ తెలుసు. గుర్తు హెలికాప్టర్‌. ఇలా ఏ రకంగా మోసాలు, కుట్రలు పన్నుతున్నారో ఆలోచించండి’ అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

తప్పుదోవ పట్టిస్తున్నారు

కాబట్టి ఈ కుట్రల మధ్య బాబుకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యం బతుకుతుందా? అని ప్రశ్నించిన జననేత, చంద్రబాబు నాయుడికి తన పరిపాలనపై చర్చ జరగొద్దని ఆలోచన అని, ఆ చర్చ జరిగితే ఈ 5 ఏళ్లు ఆయన చేసిన మోసాలు, అన్యాయాల మీద ప్రజలు ఆలోచిస్తే.. తాను ఔట్‌ అవుతానని చంద్రబాబుకు తెలుసని, బాబుతో పాటు, ఆయన బినామీలు, ఆయన ఎల్లో మీడియా అందరి పరిస్థితి అంతే అని అందరికీ తెలుçసని చెప్పారు.

అందుకే చంద్రబాబునాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు,  తన పాలనమీద చర్చ జరగకుండా, పూటకో డ్రామాను తెరపైకి తెస్తున్నాడని,  పూటకో చర్చ లేవనెత్తుతున్నాడని పేర్కొన్నారు. 

మరింత తీవ్రమవుతాయి

ఆ ప్రక్రియలో భాగంగా ఈ చివరి 14 రోజులు.. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రోజుకో కొత్త కుట్ర కనిపిస్తుందని, రోజుకో అబద్ధం కనిపిస్తుందని, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతారని చెప్పారు. 

ఇక ఎన్నికలు వచ్చేసరికి ఈ కుట్రలు తారాస్థాయికి చేరుతాయని, అందులో భాగంగా.. గ్రామాలకు డబ్బుల మూటలు పంపి, ప్రతి చేతిలో రూ.3 వేలు పెట్టి ప్రజలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు

అందుకే అందరూ తమ తమ గ్రామాలకు వెళ్లాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి అన్న తమ్ముడు, రైతు, అవ్వా తాతను కలవాలని, అన్ని వాస్తవాలను వివరించాలని కోరారు.

వీరికి ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దక్కా. 20 రోజులు ఓపిక పట్టక్కా. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే, మనకు అన్న ఏడాదికి రూ.15 వేలు ఇస్తాడని చెప్పండి. అదే విధంగా మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువు చదివించాలన్నా అన్న చూసుకుంటాడు. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే అన్ననే చదివిస్తాడని ప్రతి అక్క, ప్రతి చెల్లికి చెప్పండి. కాబట్టి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి’. 

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లికి చెప్పండి. అక్కా చంద్రబాబునాయుడిని నమ్మాం. ఓటు వేశాం. కానీ ఆయన రుణమాఫీ చేశాడా? అని అడగండి. రుణమాఫీ చేయకపోవడమే కాకుండా సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్కా 20 రోజులు ఓపిక పట్టక్కా. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాలను అన్న నేరుగా నాలుగు విడతల్లో మీ చేతుల్లో పెడతాడని చెప్పండి’.

‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వారికి చెప్పండి. చంద్రబాబునాయుడు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపికపట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతుల్లోనే రూ.75 వేలు చేతిలో పెడతాడని చెప్పండి’.

‘ప్రతి రైతుకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. ఆ తర్వాత ఏటా మే మాసంలో పెట్టుబడి కింద రూ.12,500 ఇస్తాడని, అలా నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. అంతే కాకుండా గిట్టుబాటు ధరలు కల్పించడమే కాకుండా, వాటికి గ్యారెంటీగా కూడా ఉంటాడని చెప్పండి’.

‘ప్రతి అవ్వా, తాత దగ్గరకు వెళ్లండి. అవ్వా మీకు రెండు నెలల క్రితం వరకు ఎంత పెన్షన్‌ వచ్చేదని అడగండి. అప్పుడా అవ్వ చెబుతుంది రూ.1000 వచ్చేదని. అప్పుడు ఆ అవ్వను అడగండి. అవ్వా ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న చెప్పకపోయి ఉంటే చంద్రబాబునాయుడు ఆ రూ.2 వేలు ఇచ్చేవాడా అని అడగండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, మీ మనవడు ముఖ్యమంత్రి అయితే ఆ పెన్షన్‌ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.

‘ప్రతి నిరుపేదకు చెప్పండి. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ప్రతి ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించలేదని, ఒక్కసారి జగనన్నకు అవకాశం ఇద్దాం. అప్పుడు ఇల్లు లేని నిరుపేదకు ఏటా 5 లక్షల చొప్పున అయిదేళ్లలో మొత్తం 25 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తాడని చెప్పండి’. 

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి ఒక్కరి జీవితాలు మారుస్తాయని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి రైతు, ప్రతి అవ్వా తాతకు చెప్పాలని జననేత కోరారు. ఆ పథకాలు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు తెస్తాయని, అందుకే వాటిని ప్రతి ఇంటికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

వ్యవస్థ మారాలి 

ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు రావాలని.. నిజాయితీ, విశ్వసనీయత రావాలని అన్నారు. ఇక ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి జరుగుతున్నాయని,  కాబట్టి ఈ పోరాటంలో అందరి దీవెనలు కావాలని జననేత ఆకాంక్షించారు. 

పార్టీ అభ్యర్థుల పరిచయం

వినుకొండ నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.బ్రహ్మనాయుడుతో పాటు, పార్టీ నరసారావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయులును సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

చివరలో తలపాగా ధరించి, విల్లు బాణం ఎక్కుపెట్టిన రాజన్న బిడ్డ సభలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు.

 

Tags :