ASBL NSL Infratech

ఆల్బనీ ఆంధ్ర ఉగాది వేడుకలు...రమణీయం

ఆల్బనీ ఆంధ్ర ఉగాది వేడుకలు...రమణీయం

న్యూయార్క్‌ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.  దాదాపు 14 ఏళ్లుగా ఉగాది వేడుకల్ని నిర్వహిస్తోన్న ఆటా ఈసారి కూడా ఏప్రిల్‌ 21న అల్బనీలోని ఎంపైర్‌ స్టేట్‌ ప్లాజాలోని ది ఎగ్‌ బిల్డింగ్‌లోని హర్ట్‌ థియేటర్‌లో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో పండుగను నిర్వహించింది. ఈ ఉత్సవాలకు ప్రముఖ సినీ నటుడు అలీ దంపతులు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్పీ పట్నాయక్‌, బిగ్‌ బాస్‌ విన్నర్‌ కౌశల్‌ దంపతులు, సింగర్‌ సాయి ప్రియ అతిథులుగా హాజరయ్యారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి.. అందరికీ షడ్రుచుల పచ్చడిని ప్రసాదంగా పంపిణీ చేశారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆర్పీ పట్నాయక్‌, సాయి ప్రియ పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. చిన్నారులు చేసిన డ్యాన్సులు అందరిలోనూ జోష్‌ నింపాయి. సినీ పరిశ్రమలో సింగర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌గా తన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఆర్పీ పట్నాయక్‌ ఈ సందర్భంగా పంచుకున్నారు. తన జర్నీలో కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. మరోవైపు.. బిగ్‌ బాస్‌ విన్నర్‌ కౌశల్‌ దంపతులు.. ఇచ్చిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కౌశల్‌ మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పటంతో పాటు.. తాను నటిస్తున్న తర్వాత సినిమాల గురించి తెలిపారు. తాను కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడిరచారు. ఈ సినిమాలో మంచు విష్ణు, మోహన్‌ బాబు, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌ లాంటి పెద్ద పెద్ద నటులు మంచి మంచి పాత్రలు పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన అలీ తనదైన పంచులతో కడుపుబ్బా నవ్వించారు. ఆరు బాషల్లో దాదాపు 1250 సినిమాల్లో నటించటం తన అదృష్టమని.. దాంతో పాటు ప్రేక్షకుల ఆధరాభిమానాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, తన భార్య సపోర్టు కారణమని చెప్పారు. 

అలీ తన భార్య గురించి చెబుతూ.. సుమారు 46 సంవత్సరాలుగా తాను సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతూ ఈ స్థాయికి వస్తే.. తన భార్య జుబేదా మాత్రం కేవలం ఒకటిన్నరేళ్లలో తన రికార్డును బ్రేక్‌ చేసిందన్నారు. ప్రతి సీజన్‌లో ఆ సీజన్‌కు ఏ అవసరాలుంటాయో వాటిని పేదవాళ్లకు పంచుతుందని.. ప్రతి నెల 200 మందికి తన చేతితో వండి పేదవాళ్లకు పెడుతుంటారని తెలిపారు. మనం చేసుకున్న పుణ్యం మన పిల్లలకు వస్తుందని చెప్పిన అలీ.. తాను సంపాదించే ప్రతి రూపాయిలో 35 పైసలు ఛారిటీకి ఇస్తానని పేర్కొన్నారు. మధ్య మధ్యలో తనదైన శైలిలో పంచులు పేల్చి.. ఆడిటోరియంలో నవ్వులు పూయించారు. షూటింగ్‌ సమయాల్లో తనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలను కూడా పంచుకున్నారు.

ఈ సందర్భగా అల్బనీ తెలుగు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌ జాస్తి.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే.. ఈ ఉత్సవాలు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన స్పాన్సర్లకు, అసోసియేషన్‌ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అల్బనీ తెలుగు అసోసియేషన్‌ సంస్థ ఏర్పడినప్పటి నుంచి అల్బనీలోని తెలుగు వారి అవసరాలు తీరుస్తూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తోంది. అక్కడి తెలుగు వారందరినీ వివిధ కార్యక్రమాలతో ఏకతాటిపైకి తీసుకొస్తోంది. భారత్‌లో తెలుగు వారు చేసుకొనే ప్రతి పండగను అల్బనీలోనూ వైభవంగా నిర్వహిస్తోంది. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పర్వదినాలను పురస్కరించుకొని భారీగా ఈవెంట్లు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఈఏడాది ఉగాది ఉత్సవాలను కూడా విజయవంతంగా నిర్వహించింది.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :