ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అపజయమే నా విజయానికి పునాది - పవన్ కళ్యాణ్

అపజయమే నా విజయానికి పునాది - పవన్ కళ్యాణ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో అంగరంగవైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విలువలకు కట్టుబడే రాజకీయలతో పౌర సమాజాన్ని ఏకీక తం చేసి ఐకమత్యంగా బంగారు భవిత దారిలోకి తీసుకువెళ్లేందుకు తాను జనసేన పార్టీ పెట్టానని, కానీ ఎన్నికల్లో అనుకున్నంత మద్దతు సాధించకపోయినా, ఆ అపజయాన్ని తన విజయానికి సోపానంగా మలుచుకుంటున్నానని చెప్పారు. 

ఓటమి నుండి విజయాన్ని అందుకోవడం నెల్సన్‌ మండేలా నుండి, థామస్‌ అల్వా ఎడిసన్‌ నుండి తాను నేర్చుకున్నానని పేర్కొన్నారు. తనకు ఓర్పు ఎక్కువ అని, ఎన్ని అడ్డంకులు కష్టాలు ఎదురైనా విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తానని, సమాజం విచ్ఛిన్నం కాకుండా చూడాలంటే మంచి రాజకీయాల వల్లనే సాధ్యమవుతుందని తాను నమ్ముతానని చెప్పారు. తనకు ఎప్పటినుండో విశ్వనాధ కావ్యాలు చదవాలని కోరిక ఉండేదని, ఆ పుస్తకాల కోసం ఎంత ప్రయత్నించిన దొరకకపోతే ఒక ఎన్నారై తనకు 40సంపుటాలను కానుకగా పంపించారని తెలిపారు. గతంలో తన సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ ఉండేది కాదని, ప్రవాసులు ఐటీ ఉద్యోగుల వలనే తనకు అమెరికాలో కూడా ఆదరణ పెరిగిందని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. తానా సభలకు వెళ్లవద్దని ఏవేవో కారణాలు మంతనాలు సలహాలు తనకు అందాయని కానీ కులాల కోసం విడిపోవడం కన్నా సమాజం కోసం రేపటి తరం కోసం విలువలతో కూడి అందరం కలిసి నడక సాగించాలనే తాను తానాకు వస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు ఈ వేడుకల్లో ఆనందంగా పాల్గొంటున్నానని పవన్‌ చెప్పారు.

గతంలో ఎన్నో తెలుగు సంఘాలు తనకు ఆహ్వానం పలికాయని కానీ అమెరికాలో పాతది పెద్దది అయిన తానాను ఎన్నుకోవడం వెనుక దాని సేవా చరిత్ర తనను ఆకర్షించిందని పవన్‌ వెల్లడించారు. భారతీయుల ఆలోచనలు అన్నీ కలిసికట్టుగా ఉండాలని అప్పుడే బలమైన భారతదేశం తయారవుతుందని అన్నారు. రానున్న కాలంలో అమెరికాలోని అన్ని ప్రముఖ నగరాల్లో చిన్న చిన్న సమావేశాల ద్వారా ప్రవాసులతో మమేకం అయ్యేందుకు తాను ప్రణాళికలు రూపొందించుకున్నట్లు పవన్‌ తెలిపారు. జనసేన ఓటమి విలువలతో కూడుకున్నదని అందుకు గర్వంగా ఉందని పవన్‌ అనడంతో సభికులు హర్షధ్వానాలు చేశారు. ''మనం తెలుగువాళ్లం. మనం భారతీయులం. మనం మనుషులం. భారతమాతకు జై'' అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం తానా అధ్యక్షుడు వేమన సతీష్‌, తానా సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు, తానా సభల ఛైర్మన్‌ డా.కొడాలి నరేన్‌లు పవన్‌, నాదెండ్ల మనోహర్‌లను సన్మానించారు. 

Tags :