ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నవ్యాంధ్ర అభివృద్ధి...మనందరి లక్ష్యం కావాలి..

నవ్యాంధ్ర అభివృద్ధి...మనందరి లక్ష్యం కావాలి..

డాలస్‌లో జయరామ్‌ కోమటి పిలుపు

ఉత్తర అమెరికాలో తెలుగువాళ్ళు వివిధరంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. అదే వేగంతో నవ్యాంధ్ర అభివృద్ధికి కూడా ముందుకు వస్తే రాష్ట్రం త్వరితంగా అభివృద్ధి చెందేందుకు వీలవుతుందని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జయరామ్‌ కోమటి అన్నారు. డాలస్‌లో జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఆంధ్రలో అభివృద్ధికి అవకాశాలు అపారంగా ఉన్నందువల్ల అమెరికాలో ఉన్న ఆంధ్రులు తమవంతుగా చేయూతను అందిస్తే దానిని సవ్యంగా స్వీకరించి అభివృద్ధిపరిచే బాధ్యతను తాను తీసుకుంటానని జయరామ్‌ కోమటి హామి ఇచ్చారు. http://www.apjanmabhoomi.org/ ద్వారా ఏ పనులు చేయాలనుకుంటారో తెలియజేస్తే వాటిని సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన కో ఆర్డినేషన్‌ను తమ సిబ్బంది ఇస్తారని జయరామ్‌ హామి ఇచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చేందుకే తాను దృష్టి సారిస్తున్నానని, ఈ పదవి తన ఒక్కడిది కానది, ప్రతి తెలుగువాడు నూతన రాజధాని అమరావతి ఏర్పాటులోనూ, రాష్ట్రాభివృద్ధిలోనూ భాగస్వామ్యులేనని, వారందరి తరపున తాను పనిచేస్తుంటానని చెప్పారు. ఎన్నారైలు తాము ఎంచుకున్న గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అయినా తనకు తెలిపితే ఆయా గ్రామాలకు సంబంధించిన అధికార యంత్రాంగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని ఎన్నారైలు అందించే ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా చూస్తానని జయరామ్‌ కోమటి చెప్పారు. 

ఎన్నారైల కోసం శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ, హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో తన ఆఫీసును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.   ఈ ఆఫీసులోని సిబ్బంది ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని, ఇటు ఉత్తర అమెరికాలోనూ, అటు రాష్ట్రంలోని ఆఫీసుల మధ్య సమన్వయం చేసుకుని కార్యక్రమాలు సజావుగా అయ్యేందుకు వారు కృషి చేస్తారని చెప్పారు. అమెరికాలోనూ, ఆంధ్రాలో ఉన్న సమర్థవంతులైన యూత్‌ను ఇందులో భాగస్వాములుగా చేస్తున్నట్లు జయరామ్‌ చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంకోసం గుంటూరు జిల్లా ఎన్నారైలు భారత రిజర్వ్‌బ్యాంక్‌ ఆమోదంతో ఎఫ్‌సి ఎన్నారై బ్యాంక్‌ ఖాతాలను తెరిచి జిల్లాలో 50 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేశారని, ఇప్పుడు అదే విధంగా మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి ఆమోదముద్ర లభిస్తే ఎన్నారైలు మధ్యవర్తుల అవసరం లేకుండా డైరెక్టుగా ఇక్కడ చెక్కురాసి భారతదేశంలోని అధికారులకు నేరుగా పంపిస్తే, వారు ఆయా నిధులను ఎన్నారైలు ఎంచుకున్న గ్రామాల్లో ఎంపిక చేసిన పనులకు వినియోగిస్తారని చెప్పారు. నవ్యాంధ్ర అభివృద్ధికి తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

Click here for Event Gallery

 

Tags :