ASBL NSL Infratech

తానా - కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ సంయుక్త నిర్వహణలో

తానా - కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ సంయుక్త నిర్వహణలో

తానా - కవి చిగురుమళ్ళశ్రీనివాస్ సంయుక్త నిర్వహణలో "అమ్మ నాన్న గురువు శతకపద్యార్చన"

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు శతశతక కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ సంయుక్త నిర్వహణలో జనవరి 6వ తేదీన అమ్మ.  నాన్న గురువు శతక పద్యార్చన జరుగబోతున్న సందర్భంగా ఈ ప్రత్యేక  వ్యాసం.... 

అమ్మా నాన్న గురువులపై ప్రేమ, అభిమానం, గౌరవం పెరిగే విధంగా కవి చిగురుమళ్ళ రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురు శతకాలలోని పద్యాలను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బాలబాలికలు కంఠస్తం చేసి సామూహిక గానం చేయబోతున్నారు. ఇంత బృహత్తరమైన, మహత్తరమైన కార్యాన్ని తలపెట్టిన "తానా" వారిని ముందుగా అభినందించి తీరాలి.తానా ప్రస్తుత అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి జయ శేఖర్ గారికి తెలుగు భాష పట్ల,మానవీయవిలువల పట్ల ఉన్న అనురక్తి కి ఈ కార్యక్రమం అద్దం పడుతుంది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై న్యూయార్క్ నగరంలో లాంఛనంగా ప్రారంభించడం శుభ పరిణామం. తెలుగు సాహితీ చరిత్రలో ఇది ఒక అపూర్వమైన ఘట్టం. ప్రపంచ సాహితీ చరిత్రలో అపురూపమైన ఘట్టం గా చెప్పవచ్చు. ఒక కవి రచించిన కవిత్వాన్ని (పద్యాలను) ఇంత విస్తృతమైన స్థాయిలో ఇంత విశేషంగా కంఠస్థం చేయించి  ఒకేసారి ఒకేరోజు లక్షలాది మంది పిల్లలతో గానం చేయించడం అంటే మామూలు విషయం కాదు ఇది తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటే విశిష్టమైన సంఘటన.'మాతృదేవోభవ,పితృదేవో భవ,ఆచార్యదేవోభవ' అనే మన సంస్కృతీ మూలాలను భావి తరాలకు అందించగల అక్షర యజ్ఞం. అమ్మ నాన్న గురువు యొక్క గొప్ప తనాన్ని నేటి తరానికి అత్యవసరంగా తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈనాడు పిల్లలకు కనీస అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు కల్పించడం కోసం ఆరాటపడుతున్నాం కానీ కనీస విలువలు నేర్పించడంలో విఫలం అవుతున్నాం.

ప్రత్యక్ష దైవమైన అమ్మ నిరాదరణకు గురవుతున్నది. నాన్నను యువతీయువకుల స్వేచ్ఛకు ప్రతిబంధకమైన ప్రతినాయకుని పాత్రగా మాధ్యమాల్లో చిత్రిస్తున్నారు.  యిది దురదృష్టకరం. తల్లిదండ్రుల మాట వినకపోవటం ఈతరం ప్రాథమిక లక్షణంగా మారుతోంది పిల్లలకు తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకమైన భావాలు కలిగించే ప్రచారాలు ప్రయత్నాలు అన్ని స్థాయిలలో ఆపాలి. కన్నవారిని ప్రేమించ లేని, గౌరవించలేని తరం సరైన మార్గంలో సాగలేదు. అలాగే తల్లితండ్రులు కూడా తమ పిల్లలకు భౌతికపరమైన ఆస్తిపాస్తులు సంపాదించి పెడితేనే  వారు సుఖంగా ఉంటారని ఆ ప్రయత్నాలలో నిమగ్నమై పోతూ పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవటానికి, వారితో  సంతోషంగా నడపటానికి సమయాన్ని కేటాయించ లేకపోవటం సరైన పద్ధతి కాదు.

నైతికంగా మానసికంగా మానవీయ విలువలతో మంచి మనుషులుగా పిల్లలను పెంచే ప్రయత్నం చేయాలి. ఇక గురువును హాస్యపాత్ర గా చిత్రీకరిస్తున్నారు. అది మంచిది కాదు. గురువును గౌరవించలేని జాతికి మనుగడ లేదు. కాబట్టి అమ్మానాన్న గురువు పట్ల ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకం పుస్తకాలను భద్రాద్రి కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించినారు. ఈ పుస్తకాలలోని పద్యాలను తానా వారి నిర్వహణలో లక్షలాది మంది బాల బాలికలు కంఠస్థం చేసి గానం చేయబోతున్నారు. ఈ పద్యాలను కవి అత్యంత సరళమైన భాషలో సూటిగా విద్యార్థులకు అర్థం అయ్యే ఈ విధంగా ఆటవెలది చందస్సు లో రచించారు.

అమ్మ శతకం:

1. లాలపోసెనెవరు - జోల పాడె నెవరు
ఎవరు పెరుగుబువ్వ- కలిపి పెట్టె ఎవరు
ఎత్తు కున్నదెవరు-  హత్తుకున్నదెవరు
అమ్మ మిన్న-గుడిలొ అమ్మ కన్న!

2. పుట్టెనెవరు చెప్పు-పురిటి నొప్పులులేక
పెరిగె నెవరు చెప్పు-పెంచ కుండ
ఎదిగెనెవరు చెప్పు-ఏ త్యాగములు లేక
అమ్మ మిన్న గుడిలొ అమ్మ కన్న!

3. ఆట పాట నేర్పు-మాటలాడుట నేర్పు
నడక నేర్పు మంచి నడత నేర్పు
కట్టు బొట్టు నేర్పు-కట్టు బాట్లను నేర్పు
అమ్మ మిన్న గుడిలొ అమ్మ కన్న!

వంటి అత్యంత సరళమైన పదజాలం తో కూడిన గంభీరమైన భావాలతో కూడిన పద్యాలు ఈ శతకంలో ఉన్నాయి.అమ్మ గుడిలో దేవత కన్నా గొప్పదని ఆవిష్కరించిన కవిత్వం దీనిలో వుంది.

నాన్న శతకం :

"ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న" అంటూ సాగుతుంది ఈ శతకం.

ఎండనకా వాననకా అహో రాత్రులు చెమటూడ్చి  కష్టపడి పిల్లల కోసం కోటి విద్యలు నేర్చి పోషిస్తాడు నాన్న. కష్టమనే గరళాన్ని కంఠంలో దాచుకుని పిల్లలతో నవ్వుతూ గడిపే పరమశివుడు నాన్న అన్నాడు కవి పగటివేళ రాజు- సూర్యుడు, భూమిపై రాత్రివేళ రాజు- చంద్రుడు ,కానీ అన్ని వేళలా ఇంటికి రారాజు నాన్న అంటాడు.

పిల్లల  కోసం కలలు కన్నవాడు మిమ్ములను కన్న వాడు  నాన్న. కాబట్టి నాన్న ప్రతివారి అభిమాన హీరో కావాలి కానీ సినిమా నటులు క్రికెట్ ఆటగాళ్లు కారాదని పద్యాలలో చక్కగా కవిత్వీకరిస్తాడు.

1. బాట వేసేనెవరు-బాస టయ్యెనెవరు?
కాసెనెవరు బరువు మోసె నెవరు?
బాసచేసెనెవరు-బలము బందమెవరు?
ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న!

2. అవసరముకు రాని-ఆదు కొనగరాని
నాటకాల మేటి నటుల కన్న
నాయకోత్తముండు-నాయనా నాయనా
ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న!

          ఇలా నాన్న ఘనతను చాటే పద్యాలు అనేకం ఉన్నాయి.

గురువు శతకం:

గురువు  విశ్వరూపాన్ని ఆవిష్కరించిన శతక రాజం  ఇది. సర్వ వృత్తులు గురువు నుంచి పుడతాయని అన్ని వృత్తుల కు ఉపాదులకు  గురువే మూలమని ఈ శతక పద్యాలలో చెప్పబడినాయి. "గురువుకన్నా ఎవరు గొప్ప వారు" అనే మకుటం లో అన్ని పద్యాలు రాయబడినవి .

1. అక్షరములు నేర్పి అజ్ఞాన తిమిరమ్ము  పారద్రోలునట్టి భాను డతడు
దివ్యశక్తి పంచు- దినకరుండతగాడు గురువుకన్న ఎవరు గొప్ప వాడు!

2. శిష్యగణమెతనకు సిరులుసంపద లంచు
అక్షరములె  తమకు ఆస్తు లంచు.
కదలు కల్పతరులు కద మన గురువులు
గురువుకన్న ఎవరు గొప్పవారు!

ఇటువంటి అనేక అద్భుతమైన పద్యాల తో గురువు ఘనతను కవి చాటిచెప్పారు. పై మూడు శతకాలలోని పద్య ధారణ వలన బాల బాలికలలో గొప్ప పరివర్తన కలుగుతుందని ఆశిద్దాం.

తానా అధ్యక్షులు
శ్రీ తాలూరి జయశేఖర్ గారి సందేశం.

 ----

తెలుగు భాష సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా 'తానా' పనిచేస్తుంటుంది. మనవైన ఈ సంపదలను భావితరాలకు అందించాలనేది తానా ప్రాధాన్యం. ఈ రోజు అమ్మ నాన్న గురువు శతక పద్య రచన ను ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది బాలబాలికలతో కంఠస్థం చేయించి సామూహిక గానం నిర్వహించబోతు న్నాము.

భద్రాద్రి మన్య కవి 

చిగురుమళ్ళ శ్రీనివాస్ గారి శైలి చాలా సరళమైనది, అందరికీ అర్థమయ్యేది, ఆలోచింప చేసేది  అటువంటి పద్యాలను విద్యార్థులు కంఠస్థం చేసి సామూహికంగా గానం చేస్తే ఎప్పటికీ మరిచిపోలేరు. అటు భాషా పరిరక్షణ ఇటు అమ్మ నాన్న గురువు దైవ సమానులు అన్న మన సంస్కృతీ పరిరక్షణ ఏక కాలంలో రెండు లక్ష్యాలు సాధించపడతాయని తానా ఈ బృహత్ యజ్ఞం  తలపెట్టింది.

అమ్మ నాన్నను ప్రేమించడం, గౌరవించడం వారి మాట మీద నిలబడటం వారి బాటలో నడవడం పిల్లలకు అవసరం.

ఈ తరంలో ఈ భావన కొంత లోపిస్తుంది. గురువులపై గౌరవం కూడా కొంత తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమ్మ నాన్న గురువు శతక పద్య గానం కార్యక్రమాన్ని తల పెట్టాము. దీనిలో పిల్లలు అందరూ పాల్గొని పద్యాలు నేర్చుకొని, ఆ పద్యాల సారాన్ని అర్థం చేసుకొని, అనుసరిస్తూ గొప్ప వ్యక్తిత్వంతో బాధ్యతగల పౌరులుగా,

మంచి బిడ్డలుగా ఉన్నత స్థితికి ఎదగాలని, విలువలతో అభ్యున్నతి  సాధించాలని కోరుకుంటున్నాము.

శతకకవి చిగురుమళ్ళ శ్రీనివాస్ సందేశం :

అందరూ అమ్మానాన్నలను ప్రేమించాలి, గౌరవించాలి వారి త్యాగాలను అర్థం చేసుకొని, పిల్లల కోసం వారు పడే తపన అవగాహన చేసుకొని, వారు చెప్పిన మాట విని, వారి బాటలో నడవాలనే  ఉద్దేశంతో ఈ శతకాలు రచించాను.

గురువు గొప్పతనం చాటుతూ గురువు  శతకం రాశాను. ప్రస్తుతం 'తానా' వారు ఈ పద్యాలలో ఇంత విస్తృత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో కంఠస్థం చేయించటం చాలా ఆనందంగా ఉంది. ఇది గొప్ప మార్పుకు నాంది పలుకుతున్నది అని నేను అనుకుంటున్నాను. తానా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Click here for Photogallery

 

Tags :