Vijay: ఎవరితోనూ పొత్తులుండవ్..! టీవీకే విజయ్ కీలక ప్రకటన..!!

తమిళనాడు రాజకీయాల్లో (Tamilnadu politics) హీరో విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్ట్రి కజగం (TVK) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్‌ను ప్రకటించింది. చెన్నైలో జరిగిన టీవీకే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ అధినేత విజయ్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. దీంతో డీఎంకే (DMK), అన్నాడీఎంకేలతో (AIADMK) పొత్తు లేదని విజయ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈసారి తమిళనాడులో ట్రయాంగిల్ వార్ జరగనుందని సమాచారం.
తమిళ సినీ పరిశ్రమలో దళపతిగా పేరుగాంచిన విజయ్.. 2024 ఫిబ్రవరి 2న టీవీకే పార్టీని స్థాపించారు. ఆగస్టు 22చెన్నైలో జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించారు. సామాజిక న్యాయం, సమానత్వం, తమిళ జాతీయవాదం, అవినీతి రహిత పాలన వంటి సూత్రాలపై విజయ్ పార్టీ పని చేస్తుందని ప్రకటించారు. తమిళనాడులో దశాబ్దాలుగా డిఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యం సాగిస్తున్నాయి. విజయ్ సొంత పార్టీ పెట్టడంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో విజయ్ అభిమానుల సంఘం, అఖిల భారత తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం (AITVMI) 2021 స్థానిక ఎన్నికల్లో 169 సీట్లలో పోటీ చేసి 113 సీట్లు గెలుచుకుంది. ఇది విజయ్ రాజకీయ బలాన్ని సూచిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేశారు. అయితే ఇవాల్టి సమావేశంలో ఆ ఊహాగానాలకు విజయ్ చెక్ పెట్టారు. డిఎంకేతో కానీ, బీజేపీతో కాని ఎలాంటి పొత్తూ ఉండదని స్పష్టం చేశారు. “మేము డిఎంకే లేదా బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోము. బీజేపీ మతం, కుల, జాతి, లింగ, సంపద ఆధారంగా విభజిస్తోంది. ఇక డిఎంకే డ్రవిడ జాతిగా చిత్రీకరిస్తూ అవినీతి, కుటుంబ రాజకీయాలు చేస్తోంది. టీవీకే ఒక స్వతంత్ర శక్తిగా ఎదుగుతుంది. సొంతంగా పోటీ చేస్తుంది” అని విజయ్ తెలిపారు. పెరియార్, కామరాజ్, అంబేద్కర్, వేలు నాచియార్, అంజలై అమ్మాళ్ వంటి ఐడియాలజీలను అనుసరిస్తామని విజయ్ పేర్కొన్నారు. సెప్టెంబరు నుంచి టీవీకే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు విజయ్ ప్రకటించారు. విజయ్ కి ఇప్పటికే విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఇది కచ్చితంగా ఎన్నికల్లో లబ్ది చేకూరుస్తుందని టీవీకే నమ్ముతోంది.
ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పడం ద్వారా డిఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు విజయ్ సిద్ధమైనట్లు అర్థమవుతోంది. డిఎంకే ఇప్పుడు అధికారంలో ఉంది. ఆ పార్టీకి సంస్థాగతంగా మంచి పట్టుంది. కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసి డీఎంకే పని చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి 39 సీట్లను గెలుచుకోగా, బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీన్ని బట్టి ఆ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం వల్ల అన్నాడీఎంకే భారీగా నష్టపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీని ఏకతాటిపై నడిపించే నాయకుడు లేకుండా పోయారు. దీంతో పార్టీ నేతలు విజయ్ లాంటి సమర్థవంతమైన నేతకోసం చూస్తున్నారు. చాలా మంది అన్నాడీఎంకే నేతలు విజయ్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్నికల్లో డీఎంకే, టీవీకే పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది.