మోదీ కృషి చేసేది ఆ ముగ్గురి కోసమే.. రాహుల్ గాంధీ..

భారతదేశంలో రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అటువంటి పార్టీ గత కొద్ది కాలంగా దాదాపు అంతరించుకుపోయే పరిస్థితికి వచ్చింది. పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి నేతలతో పాటు రాహుల్ గాంధీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది అన్న రాహుల్ గాంధీ.. పార్టీలో మార్పులు జరగాలని పేర్కొన్నారు. లక్నోలో ‘సమృద్ధ్ భారత్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ సమ్మేళన్’ లో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో మోదీ గురించి మాట్లాడుతూ.. ఆయన ఒక చక్రవర్తి అంటూ ధ్వజమెత్తారు. మోదీ పనిచేసేది ప్రజల కోసం కాదని.. కేవలం ఇద్దరు ముగ్గురు ఫైనాన్షియర్ల కోసమే అంటూ ఆరోపించారు. మళ్లీ నరేంద్ర మోదీ కి ప్రధాని అయ్యే అవకాశం రాదని.. కావాలంటే లిఖితపూర్వకంగా రాసిస్తానని రాహుల్ సవాల్ విసిరారు. రాజకీయంలోకి వచ్చాక కొందరు అధికారం ఎలా పొందాలి అని మాత్రమే ఆలోచిస్తారు.. కానీ తనక అవసరం లేదని రాహుల్ గాంధీ అన్నారు. తన దృష్టిలో అధికారం కేవలం ప్రజలకు సాయపడే ఒక సాధనమని పేర్కొన్నారు.