మంత్రుల పనితీరుపై ప్రధాని కసరత్తు

ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన దిశగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజూ కొందరు కొందరు కేంద్ర మంత్రులతో ఆయన నివాసంలో భేటీ అవుతున్నారు. ఈ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. ఆయా కేంద్ర మంత్రులు తమ తమ శాఖల్లో సాధించిన ప్రగతి, పెండింగ్‌లో ఉన్న పనులు, నిధులు…. ఇలా ఆయా కేంద్ర మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టును స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఇంతటి కీలక సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకూ పెట్రోలియం శాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖా, స్వయం సమృద్ధి శాఖ, భారీ పరిశ్రమలు, అటవీ శాఖ, రైల్వే, పౌర విమానయానం, పట్టణాభివృద్ధితో పాటు ఇతర శాఖల మంత్రుల పనితీరుపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల్లో ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రకటించారని కూడా మోదీ ఆయా శాఖల మంత్రుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రబలంగా వీయడంతో ప్రధాని మోదీపై ప్రజల్లో కాస్త అసంతృప్తి పెరిగిపోయింది. కరోనా కారణంగా మంత్రులు కూడా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని తీసేసి, తాజా కార్యక్రమాలతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై కూడా మోదీ కేంద్ర మంత్రులకు తగు మార్గదర్శనం చేస్తున్నారు. కోవిడ్ సంక్షోభం, ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడం, వలస కార్మికుల జీవితాలు తదితర పరిణామాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మోదీ, ఆ అధ్యయనం ఆధారంగా కేంద్ర మంత్రులు కొత్తగా రూపొందించాల్సిన సంక్షేమ పథకాల రూపకల్పనపై తగు సూచనలు ఇస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడం, పాజిటివిటీ రేటు కూడా తగ్గిన నేపథ్యంలో కేంద్ర మంత్రులందరూ తిరిగి ప్రజల్లోకి, తమ తమ నియోజకవర్గాల్లోకి వెళ్లి, విస్తృతంగా పర్యటించాలన్న టాస్క్ కూడా మోదీ వారికి ఇచ్చారు.