రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాధ్యం : నిర్మలా సీతారామన్
పెట్రోల్, డీజీల్, గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు అంగీకరిస్తే వెంటనే వాటిని జీఎస్టీ కిందకు తీసుకొస్తామన్నారు. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులతో బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్తు, సేవల పన్ను పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ స్పందిస్తూ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాథ్యమవుతుందని అని తెలిపారు. దేశవృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. తాజా బడ్జెట్లోనూ మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చాం అని ఆమె తెలిపారు. కేంద్ర విద్యుత్ సహా పలు రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్రాలు కూడా అమలు చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు.






