ఐటీ రిటర్నులకు గడువు పెంచేది లేదు : కేంద్రం
ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు పెంచే యోచనేదీ లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. జులై 31 ఆఖరు తేదీగా ఉంటుందని, చాలా మటుకు రిటర్నులు తుది గడవులోగానే వస్తాయని ఆయన పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను జూలై 20 వరకూ 2.3 కోట్ల పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. కొవిడ్ పరిణామాలు, ఐటీ పోర్టల్‌లో సమస్యలు తదితర అంశాల కారణంగా గతేడాది డిసెంబర్ 31 వరకూ గడువు పెంచిన సంగతి తెలిసిందే. ఈసారి అలాగే జరుగుతుందనే ఉద్దేశంతో కొందరు నెమ్మదిగా ఐటీఆర్‌లు దాఖలు చేయొచ్చులే అని భావిస్తుండవచ్చని పేర్కొన్నారు. కానీ ఈసారి డెడ్‌లైన్‌ను పొడిగించే యోచనేదీ లేదన్నారు.






