స్వదేశానికి చేరుకున్న 1000 మంది భారత విద్యార్థులు : కేంద్రం

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేస్తోన్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలను దారితీశాయి. ఈ నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 1000 మంది విద్యార్థులు వచ్చారు. వారిలో 778 మంది సరిహద్దు మార్గాల ద్వారా రాగా, మరో 200 మంది విమానాల్లో సొంత దేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
అంతర్జాతీయ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకుంటున్న విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఢాకాలోని భారత హై కమిషన్ అన్ని సదుపాయలు కల్పిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నిమిత్తం పౌర విమానయాన శాఖ, సరిహద్దు భద్రతా దళంతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడిరచింది. ఇప్పటికే దాదాపు 1000 మంది విద్యార్థులు స్వదేశానికి రాగా, ఇంకా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న 4 వేల మంది విద్యార్థులతో హై కమిషన్ కాంటాక్ట్‌లో ఉంది.